
* రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క
ఆకేరున్యూస్, ములుగు: విద్యార్థులు చదువుతో పాటు సంస్కారం నేర్చుకోవాలని, జిల్లాలో నూతన పరిజ్ఞానంతో విద్యా బోధన అందించడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళ, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం తాడ్వాయి మండలం ప్రభుత్వ గిరిజన అశ్రమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆమె సందర్శించారు. అలాగే జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా , గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి చందర్లతో కలిసి కన్నాయిగూడెం మండలం ఏటూరు గ్రామంలో ప్రజాపంపిణీ ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యా బోధన చేస్తున్నవిద్యార్థులు తమ హాస్టల్ లను ఇల్లు లాగా చూసుకుంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కష్టపడే ప్రతి వ్యక్తికి ఎలాంటి వ్యాధులు సోకవని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేస్తూ ధరుడ్యాం పెంపొందించుకోవాలని సూచించారు. గత కొద్ది నెలల క్రితం పలు కంపెనీల సహకారంతో పాఠశాలలోని విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా విద్యా బోధన చేయడానికి అవకాశాలను మెరుగుపరచడం జరిగిందని, రానున్న రోజులలో ఆశ్రమ పాఠశాలలో సైతం కంప్యూటర్ ద్వారా నూతన పరిజ్ఞానంతో విద్యా బోధన చేయడం జరుగుతుందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులకు త్వరగా ఇంగ్లీష్ రావడానికి కంప్యూటర్లు ఎంతగానో దోహదపడుతున్నాయని, ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సైతం సులభతరంగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ములుగు మండలం జగ్గన్నపేట, తాడ్వాయి మండలంలోని ఆశ్రమ కళాశాలలకు అధికారికంగా అనుమతి వచ్చిందని, చిన్నతనం నుండే కంప్యూటర్ ధ్యానం నేర్చుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరికి ఎంత జ్ఞానం ఉన్న ఇంగ్లీష్, కంప్యూటర్ జ్ఞానం లేని పక్షంలో అంత వృధా అవుతుందని, రానున్న రోజులలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యలో ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలని, పదిమందికి సహాయం చేసేలా, మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు, ఇతరులు గౌరవించే విధంగా ఉండాలన్నారు. విద్యార్థులకు విద్యతోపాటు నైతిక విలువలు పెంపొందించే విధంగా సంబంధిత ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ఆశ్రమ పాఠశాలకు చేరుకున్న మంత్రికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం 15 కంప్యూటర్లు కలిగి ఉన్న ల్యాబ్ ను ప్రారంభించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం కన్నాయిగూడెం మండలం ఏటూరు గ్రామంలో సన్నబియ్యం పంపిణీ చేశారు.
……………………………………