* సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ‘బస్తీ బాట’…
* జిహెచ్ఎంసి విభజనపై సంచలన వ్యాఖ్యలు
* అధికారులకు కీలక ఆదేశాలు, ప్రభుత్వంపై విమర్శలు..
ఆకేరు న్యూస్, సికింద్రాబాద్: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నగర ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ‘బస్తీ బాట’ కార్యక్రమాన్ని చేపట్టారు. శుక్రవారం సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, స్థానికులతో ముఖాముఖి మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా బౌద్ధనగర్, సీతాఫల్మండి, మెట్టుగూడ వంటి కీలక ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రికి ప్రజలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. మురుగునీరు రోడ్లపైకి వస్తోందని స్థానికులు ఫిర్యాదు చేశారు.
మౌలిక సదుపాయాలు
ధ్వంసమైన రోడ్లు, తాగునీటి ఎద్దడిపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీల్లో పారిశుద్ధ్య నిర్వహణ లోపించిందని కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన కిషన్ రెడ్డి, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.
జీహెచ్ఎంసీ విభజనపై సంచలన వ్యాఖ్యలు
ఈ పర్యటన సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పనితీరుపై కేంద్ర మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసమే నగర పాలక సంస్థను నీరుగారుస్తున్నారని ఆయన విమర్శించారు. “భారతీయ జనతా పార్టీని రాజకీయంగా అణచివేయాలనే కుట్రతోనే జీహెచ్ఎంసీని మూడు భాగాలుగా విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు. పాత నగరాన్ని పూర్తిగా మజ్లిస్ పార్టీకి ధారాదత్తం చేయాలని చూస్తున్నారు.” అని కిషన్ రెడ్డి ఆరోపించారు.
రాజకీయ లాలూచీపై విమర్శలు
రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు మజ్లిస్ (AIMIM) లోపాయికారీ ఒప్పందాలతో పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ప్రజల ప్రాథమిక సమస్యలను గాలికొదిలేసిందని మండిపడ్డారు. నగర అభివృద్ధిని కుంటుపరుస్తున్నారని ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను కాలయాపన చేయకుండా తక్షణమే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పర్యటనలో స్థానిక బీజేపీ నాయకులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
