
* హరిహర వీరమల్లు సినిమా ప్రెస్మీట్లో పవన్ కల్యాణ్ వెల్లడి
ఆకేరున్యూస్, సినిమా డెస్క్ : ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నిర్మాత ఏఎం రత్నం ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణ మురళి పని చేశారు. ఆయన సినీ పరిశ్రమ సమస్యల కంటే.. రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు అన్న విమర్శ ఉంది. అందుకే ఈసారి సినీ పరిశ్రమ పై పూర్తి అవగాహన ఉన్నవారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తొలుత సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పేరు వినిపించింది. ఈయన గతంలో ఈ పదవి చేపట్టారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కూడా. గత ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. ఎటువంటి పదవి చేపట్టలేదు. అందుకే తనకు ఆ పదవి కేటాయించాలని చంద్రబాబును కోరినట్లు సమాచారం. అయితే.. ఈరోజు జరిగిన హరిహర వీరమల్లు సినిమా ప్రెస్ మీట్లో అనూహ్యంగా పవన్ ఏఎం రత్నం పేరును తెరపైకి తెచ్చారు. ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏఎం రత్నం పేరును ప్రతిపాదించినట్లు వెల్లడించారు. ఈ శాఖ తన వద్దే ఉండడంతో చొరవ చూపానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కూడా ఈ విషయం చెప్పానన్నారు. తన సినిమా నిర్మాత అని కాదని, ఈయన అందరి సినిమాలూ తీశారని తెలిపారు. పాన్ ఇండియా ప్రతిఒక్కరికీ ఈయన అంటే తెలుసు అన్నారు. ఇలాంటి వ్యక్తి అలాంటి పదవిలో ఉంటే మంచిదని తాను భావిస్తున్నా అన్నారు. భారతీయ, తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి జరగాలనే ఆయన పేరును ప్రతిపాదించానన్నారు. భవిష్యత్ లో ఆయన చైర్మన్ అవుతారని భావిస్తున్నానని, ఎందుకంటే అన్నీ తన చేతుల్లో ఉండవు కదా అన్నారు.
…………………………………………