Amit Shah scheduled to visit Telangana on November 2
* ‘మహా పాదయాత్ర’తో బీజేపీ సమరశంఖం
* ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం.. అరాచకత్వాన్ని అంతం చేద్దాం’..
* హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర
ఆకేరు న్యూస్, డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ (BJP) సమరశంఖం పూరించింది. నవంబర్ 2న కేంద్ర హోంమంత్రి అమిత్ షా భాగ్యనగరానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా నగరంలో నిర్వహించనున్న భారీ ‘మహా పాదయాత్ర’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు.
* ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం.. అరాచకత్వాన్ని అంతంచేద్దాం’..
“ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం.. అరాచకత్వాన్ని అంతంచేద్దాం” అనే ప్రధాన నినాదంతో బీజేపీ ఈ మహా పాదయాత్రను రూ పొందించింది. కాంగ్రెస్, ఇండీ కూటమి పక్షాలు చేపడుతున్న ప్రచారాలను, ఎస్ఐఆర్ (SIR – ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) పై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టబోతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
* ప్రజల మధ్యలోనే పాదయాత్ర – అధిష్టానం ఆదేశాలు..
ముందుగా ఈ పాదయాత్రను ట్యాంక్‌బండ్ నుంచి నిర్వహించాలని భావించినప్పటికీ, పార్టీ కేంద్ర నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం బహిరంగ ప్రదేశాలు లేదా నిర్మానుష్య రహదారుల్లో కాకుండా, నేరుగా సామాన్య ప్రజల మధ్యలో ఈ పాదయాత్ర సాగాలని సూచించింది. కేంద్ర అధిష్టానం ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం రూట్‌ను సవరించే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర నాయకులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, మొజంజాహీ మార్కెట్, నంపల్లి పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వ్యాపారులు, పౌరులతో అమిత్ షా నేరుగా మమేకమయ్యేలా, సాధారణ రద్దీ ప్రాంతాల మీదుగా ఈ పాదయాత్ర మార్గాన్ని ఖరారు చేసేందుకు మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నారు.
* జన సమీకరణపై హైలెవల్ మీటింగ్..
పాదయాత్ర నిర్వహణ, జన సమీకరణ మరియు భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర బీజేపీ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, రాష్ట్ర బీజేపీ సహ ఇంచార్జి అభయ్ పాటిల్, పార్టీ ప్రధాన కార్యదర్శులు మరియు ఇతర ముఖ్య నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, జాతీయవాదులు, మేధావులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి వేలాదిగా కార్యకర్తలను సమీకరించేందుకు ప్రతి ఒక్క నాయకుడికి బాధ్యతలు అప్పగించారు.
* రాజకీయం హీటెక్కిస్తున్న ‘కౌంటర్’ వ్యూహాలు..
నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ వ్యవహారాలపై ర్యాలీ నిర్వహిస్తుండగా, దానికి మరుసటి రోజే (నవంబర్ 2న) హైదరాబాద్ వేదికగా అమిత్ షాతో పాదయాత్ర చేపట్టడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే స్థానిక సంస్థలు, ఉప ఎన్నికల వేళ ఈ మహా పాదయాత్ర ద్వారా తెలంగాణలో తమ బలాన్ని నిరూపించుకోవాలని, శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

