
* దేశ వ్యాప్తంగా 103
* వర్చువల్ గా ప్రారంభించిన మోదీ
* తెలంగాణలో వరంగల్, కరీంనగర్, బేగంపేట స్టేషన్లు ప్రారంభం
* 40 రైల్వే స్టేషన్లలో దాదాపు 2,450 కోట్లతో పనులు : కిషన్ రెడ్డి
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశ వ్యాప్తంగా 103 అమృత్ భారత్ స్టేషన్ల(amrit bharat railway stations)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. రాజస్థాన్ నుంచి మోదీ (Modi) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ జెండా ఊపి స్టేషన్లను ప్రారంభించారు. ప్రారంభోత్సవం తర్వాత అక్కడి పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. తెలంగాణలో బేగంపేట, కరీంనగర్, వరంగల్ అమృత్ భారత్ స్టేషన్లను, ఆంధ్రప్రదేశ్ లో సూళ్లురుపేట స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని వాటిని జాతికి అంకిత చేశారు. యూపీలో 19, గుజరాత్ లో 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్లో 8 అమృత్ భారత్ స్టేషన్లను మోదీ ప్రారంభించారు. కరీంనగర్లో ఆధునీకరించిన రైల్వే ష్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పాల్గొన్నారు. బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.లక్ష కోట్ల వ్యయంతో 1300కు పైగా రైల్వేస్టేషన్ల పునరభివృద్ధి పనులు చేపట్టినట్లు కిషన్ రెడ్డి (Kishanreddy) తెలిపారు. వీటిలో తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లలో దాదాపు 2,450 కోట్లతో పనులు చేపట్టామన్నారు. ఈ ఏడాది రైల్వే బడ్జెట్లో తెలంగాణకు 5,337 కోట్లు కేటాయించారని, 2014-15 నాటి బడ్జెట్ తో పోలిస్తే ఇది 20 రెట్లు ఎక్కువ అని వివరించారు.
……………………………………………