*ప్రేమ వేధింపులకు ఇంజనీరింగ్ విద్యార్థిని బలి..
*నారపల్లి హాస్టల్లో నందిని ఆత్మహత్య
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
నగర శివార్లలోని నారపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు హాస్టల్లో నివాసముంటున్న ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
*ఘటన వివరాల్లోకి వెళ్తే…
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం, దేవనితండా(శనుగుల) గ్రామానికి చెందిన రైతు బానోత్ తేజకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. చిన్న కుమార్తె బానోత్ నందిని (19) ఘటకేసర్ మండలం కోరెమ్ములలోని సిద్ధార్థ కళాశాలలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతోంది. చదువు నిమిత్తం ఆమె నారపల్లిలోని ‘టీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్ పీజీ హాస్టల్’లో ఉంటోంది.
బుధవారం రాత్రి హాస్టల్ వార్డెన్, నందిని తండ్రికి ఫోన్ చేసి ఒక చేదు వార్తను అందించారు. నందిని తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం ఇచ్చారు. గురువారం ఉదయం తండ్రి తన పెద్ద కుమార్తెతో కలిసి హాస్టల్ వద్దకు చేరుకుని, విగతజీవిగా పడి ఉన్న నందినిని చూసి కన్నీరుమున్నీరయ్యారు.
*యువకుడి వేధింపులే కారణమా?
నందిని మృతిపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఒక యువకుడు గత కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ వేధింపులు భరించలేకనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శివకుమార్ ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
*గ్రామంలో ఉద్రిక్తత – పోలీసుల భారీ బందోబస్తు…
నందిని మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించే సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిందితుడిగా భావిస్తున్న యువకుడి ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లి నిరసన తెలపాలని బంధువులు, గ్రామస్థులు ప్రయత్నించారు. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి ఎస్ఐలతో పాటు సుమారు 25 మందికి పైగా పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. పోలీసుల జోక్యంతో చివరకు ఉద్రిక్తత సద్దుమణిగింది. భారీ భద్రత నడుమ నందిని అంత్యక్రియలు పూర్తి చేశారు.
