* గత ప్రభుత్వంలో అడ్డగోలుగా సహజవనరుల దోపిడీ
* అటవీ సంపదను కూడా దోచుకున్నారు
* స్మగ్లర్లను ప్రోత్సహించారు
* భవిష్యత్లో భూకబ్జా చేయాలంటే భయపడేలా చేస్తాం
* ల్యాండ్ గ్రాబింగ్ చట్టాం తెస్తాం..
* మీ భూములు కబ్జాకు గురైతే ఫిర్యాదు చేయండి
* ఎవరి చేతుల్లో ఉన్నా తిరిగి ఇప్పించే బాధ్యత మాది
* ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
* సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల
ఆకేరు న్యూస్, అమరావతి : వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం గనుల అక్రమాల విలువే 19,000 కోట్లుగా ఉందని, గనుల తవ్వకాలు, అమ్మకాల్లో విపరీతమైన దోపిడీకి పాల్పడ్డారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) తెలిపారు. సహజ వనరుల దోపిడీపై అమరావతిలో ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మూడు రంగాల్లో శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై నేడు శ్వేతపత్రం విడుదల చేశారు.
అంతులేని దోపిడీ
యథేచ్ఛగా రాష్ట్రంలో అంతులేని దోపిడీకి పాల్పడ్డారని, కేవలం దోపిడీ కోసమే బయట నుంచి తీసుకొచ్చి కొంత మంది అధికారులను నియమించారని చంద్రబాబు ఆరోపించారు. గనుల తవ్వకాలు, అమ్మకాల్లో విపరీతమైన దోపిడీకి పాల్పడ్డారని, అడవులను కూడా ధ్వంసం చేశారని తెలిపారు. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వల కొండను, వైజాగ్లో రుషులు జ్ఞానం చేసిన రుషికొండను కూడా కొట్టేశారని అన్నారు. 23 పార్టీ ఆఫీసుల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గత ప్రభుత్వం స్మగ్లర్లను ప్రోత్సహించిందని తెలిపారు.
కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తాం
అవకాశం ఉంటే ఆకాశమే హద్దుగా గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు తెలిపారు. భవిష్యత్లో ఎవరైనా భూకబ్జా చేయాలంటే భయపడేలా చట్టాలు తెస్తామన్నారు. గుజరాత్లోని ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తామన్నారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూకబ్జాలు జరిగాయని అన్నారు. పుంగనూరులో 982 ఎకరాలకు వైసీపీ (YCP) నేతలు పట్టా చేయించుకున్నారని, హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో వైసీపీ నేతలదే నిర్ణయమన్నారు. గ్రామాల్లో ఉన్న ఖాళీ భూములను కూడా కబ్జా చేశారన్నారు.
ఫిర్యాదు చేస్తే మీ భూములు మీకు ఇప్పిస్తాం..
గత ప్రభుత్వ హయాంలో ఎవరి భూమినైనా ఎవరు కబ్జా చేసినా, లాక్కున్నా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని బాధితులకు చంద్రబాబు సూచించారు. ఎవరి చేతుల్లో ఉన్నా ఆ భూములున్నా తిరిగి ఇప్పించే బాధ్యత తమదని తెలిపారు. ఇందుకు ప్రత్యేక సిస్టం ఏర్పాటు చేస్తామని, ఫిర్యాదులను స్వీకరిస్తామని వెల్లడించారు.
———————————————————