* ఆ ఇంటి ముందు మళ్లీ భార్యాపిల్లల ఆందోళన
* శ్రీనివాస్ ఇంట్లో మాధురి ఉండడంపై ఆగ్రహం
ఆకేరు న్యూస్, శ్రీకాకుళం : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. భార్య వాణి.. మాధురిల వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ఈ ఎపిసోడ్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు కొనసాగుతున్నాయి. అక్కవరంలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వాణి వెళ్లొచ్చంటూ టెక్కలి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఆ ఇంటిని మాధురి పేరుపై దువ్వాడ రిజిస్ట్రేషన్ చేశారు. తాజాగా నిన్న శుక్రవారం ఇంట్లోకి మాధురి ప్రవేశించింది. ఈ రోజు శనివారం ఆమె బాల్కనీలో తిరుగుతూ ఉండగా గమనించి, వాణి, ఆమె కుమార్తెలు మరోసారి ఆ ఇంటి ముందు ఆందోళన మొదలుపెట్టారు. మాధురికి ఇంట్లో ఉండే హక్కు లేదని వాణి అంటున్నారు. వాణితో పాటు కుమార్తెలు ఆ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు.
ఆ ఇల్లు నాదే.. పోలీసులు రక్షణ కల్పించాలి : మాధురి
దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, ఆమె కుమార్తెలు ఇంటి ముందు ఆందోళన చేస్తుండడంపై మాధురి ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు ఆ ఇల్లు తనదని, శ్రీనివాస్ తన పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. ఇల్లు దువ్వాడ శ్రీనివాస్ది కాదన్నారు. నాకు రూ. 2 కోట్లు ఇవ్వాలని ముందు నుంచి చెబుతున్నా అని, అందుకే ఇల్లు తనపై రాశారని వెల్లడించారు. తన ఇంటికి వచ్చి వాణి అల్లరి చేస్తున్నారని, వాణి నా ఇంటికి పవర్ కట్ చేశారని ఆరోపించారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేశారన్నారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
కుట్రతోనే రిజిస్ట్రేషన్ చేశారు : వాణి
కుట్రతోనే మాధురి పేరు మీద శ్రీనివాస్ ఇంటిని రిజిస్ట్రేషన్ చేశారని వాణి అంటున్నారు. 5వతేదీన ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు. నిన్న శుక్రవారం మాధురిపై ఇంటిని రిజిస్ట్రేషన్ చేశారన్నారు. తప్పుల మీద తప్పు చేస్తున్నారని విమర్శించారు. ఇది నా ఇల్లు.. రాజీపడే ప్రసక్తి లేదు.. న్యాయం జరిగే వరకు పోరాడతా.. అని వాణి మీడియాకు వెల్లడించారు.
————————