* తెలుగు జాతి ఐక్యంగా ఉండాలి
* త్వరలోనే తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తా
* ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం కావని, సానుకూల చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అన్నారు. సీఎంగా తొలిసారి ఆయన హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు (NTR trust bhavan)విచ్చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ముందుకు పోవాలని, నిన్న జరిగిన చర్చలు ఐక్యంగా ముందుకు తీసుకుపోవడానికి దోహద పడతాయని అన్నారు. గొడవలతో లాభం కంటే నష్టమే ఎక్కువ అన్నారు.
తెలంగాణ గడ్డపై పుట్టిన పార్టీ టీడీపీ
తెలంగాణ గడ్డపైనే పుట్టిన పార్టీ తెలుగుదేశమని, త్వరలోనే తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తానని వెల్లడించారు. పార్టీ కోసమే పని చేసేవారు ఇక్కడ చాలా మంది ఉన్నారని తెలిపారు. మళ్లీ పార్టీని బలోపేతం చేసి యువకులను ప్రోత్సహిస్తానని, యువరక్తంతో పార్టీని నింపుతానని వెల్లడించారు. చదువుకున్న వ్యక్తులను పార్టీలోకి తీసుకొస్తామన్నారు.
ఏపీకి ఒక విధానం.. టీజీకి మరొక విధానం..
ఆంధ్రప్రదేశ్‌కు ఒక విధానం, తెలంగాణకు మరో విధానం పెట్టి పార్టీని మంచిగా అభివృద్ధి చేసుకుందామన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని చంద్రబాబు చెప్పారు. తన గెలుపులో హైదరాబాద్‌లో ఉన్న వారు కీలకంగా మారారని, అందరి కృషితో ఏపీ ఎన్నికల్లో గెలిచామన్నారు. అందరి రుణం తీర్చుకుంటానని చెప్పారు. 2004కు ముందు ఉద్యమ స్పూర్తితో పనిచేశానని గుర్తు చేశారు. చెడ్డవారు పాలన చేస్తే ఎలా ఉంటుందో ఐదేళ్లు చూశారని, మంచివారు పాలన చేస్తే ఎలా ఉంటుందో వచ్చే ఐదేళ్లు చూపిస్తానని తెలిపారు.
——————————————–