* ఫార్మా కంపెనీల కాలుష్యంతో చేపలు చనిపోతున్నాయని ఆందోళన
* అరబిందో కంపెనీని మూసివేయాలని డిమాండ్
* పవన్ వచ్చే వరకు ఆందోళన విరమించబోమని వెల్లడి
* పిఠాపురం ఎమ్మెల్యేపై ఆగ్రహం
* కమిటీ వేస్తాం : పవన్ కల్యాణ్
* అత్యవసర సమస్యలను గుర్తించామని ప్రకటన
ఆకేరు న్యూస్, పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ తీరంలో మత్య్సకారులు ఆందోళనను ఉధృతం చేశారు. నిన్న జాయింట్ కలెక్టర్ వెళ్లి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy Cm Pavam Kalyan) వచ్చే వరకు సముద్రంలో వేటకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. సముద్రంపై ఆధారపడే జీవిస్తున్నామని, ఫార్మా కంపెనీల కాలుష్యం (Pharma Polution) వల్ల చేపలు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ రావాలి.. రావాలి.. అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆయనకే మాకు న్యాయం చేయాలని పేర్కొంటున్నారు. జ్వరంతో ఉన్నా ఓట్లు అడిగేందుకు వచ్చిన పవన్.. సమస్యల పరిష్కారానికి రారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందుల ఫ్యాక్టరీల కలుషితం సముద్రంలో కలుస్తుండటంతో చేపలు వలలకు చిక్కడం లేదని, మత్స్య సంపద అంతరించిపోతుందనే భయంతో పెద్ద సంఖ్యలో మత్స్యకారులు రోడ్డుపైకి వచ్చారు. ఉప్పాడ జంక్షన్ వద్ద రహదారిని దిగ్బంధం చేస్తూ, ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి ₹1,50,000 ఆర్థిక సాయం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకప్పుడు రాత్రి వేటకు వెళ్లి తెల్లారేసరికి వలల్లో కుప్పలు కుప్పలుగా చేపలు పడితే, ఇప్పుడు మత్స్యకారులు ఉట్టి చేతులతో తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రంతా సముద్రంలో గడిపినా, రెండు మూడు చేపలు మాత్రమే వలలో పడుతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యానికి కారణమవుతున్న అరబిందో కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
త్వరలోనే ఉప్పాడ వస్తా : పవన్
మత్య్సకారుల ఆందోళనపై పవన్ కల్యాణ్ స్పందించారు. మరణించిన 18 మత్స్యకార కుటుంబాలకు ఇవ్వాల్సిన బీమా, దెబ్బతిన్నపడవలకు నష్టపరిహారంపై అధికారులతో చర్చించినట్లు పవన్ (Pavan) తెలిపారు. కమిటీ నివేదికలతో సంబంధం లేకుండా తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలపై దృష్టి సారించానని అన్నారు. సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు, మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీ వేస్తామన్నారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలను కూడా గుర్తించామని తెలిపారు. త్వరలోనే ఉపాడ వచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నారు. జీవనోపాధి మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనాపైనా కమిటీ దృష్టి పెడుతుందన్నారు. నష్టపరిహారం మదింపు కూడా కమిటీ చేస్తుందన్నారు.
………………………………………….
