అన్నా- చెల్లెళ్లు.. మధ్యలో బాబాయ్ హత్య..!
* తాజాగా తెరపైకి తల్లులు
* హీటెక్కుతున్న ఏపీ రాజకీయం
* కుటుంబ సభ్యుల మధ్య వార్
* అన్నను వెంటాడుతున్న బాణం
* నేను అభిమన్యుడిని కాదు.. అర్జునుడిని అంటున్న అన్న
* ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా వివేకా హత్య
* హంతకులకు ఓటు వేయవద్దంటూ చెల్లెళ్ల ప్రచారం
* అవినాష్ అమాయకుడు కాబట్టే సీటు ఇచ్చానంటున్న జగన్
ఆకేరు న్యూస్, విజయవాడ:
‘‘రాజకీయమా.. కుటుంబ వ్యవహారమా..’’.. వివేకా హత్య నేపథ్యంలో తీసిన ఓ చిత్రంలోని డైలాగ్ ఇది. జగన్ పాత్రధారి వివేకా వద్దకు వచ్చి ‘‘చిన్నాయనా.. నీతో ఓ విషయం మాట్లాడాలా..’ అన్నప్పుడు.. వివేకా పాత్రధారి స్పందన అది. ఇప్పుడు సినిమాలను మించిన రాజకీయాలు ఏపీలో నడుస్తున్నాయి. లెక్కలేనన్ని ట్విస్ట్ లు.. అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. బాబాయి వివేకానంద రెడ్డి హత్య ప్రధాన అంశంగా అన్నాచెల్లెళ్ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. కౌంటర్లు.. ఎన్కౌంటర్లు నడుస్తున్నాయి. రాజకీయం, కుటుంబం వేర్వేరుగా కాకుండా కుటుంబంలో జరిగిన ఘటనలే రాజకీయ అస్త్రాలుగా మారిపోయాయి. ఒక అన్న – ఇద్దరు చెల్లెలు మద్యలో బాబాయి హత్య నేపథ్యం ఇదే ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రచారంశాలుగా మారిపోయాయి.
* అన్నాచెల్లెళ్ల మధ్య మాటల తూటాలు
వైసీపీ చీఫ్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జగన్ చెల్లెలు కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య ఎన్నికల ఆరంభం నుంచీ మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అన్న జగన్ టార్గెట్‌గానే షర్మిల రాజకీయాలు చేస్తున్నారు. కేవలం విమర్శల వరకూ మాత్రమే కాదు.. గేట్లు కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు, గుంతలు పడ్డ గుంటూరు రోడ్లు వంటి చోట్లకు స్వయంగా వెళ్లి మరీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్సార్ వారసుడు కాదనీ, వైఎస్సార్సీపీలో రాజశేఖర్ రెడ్డి లేనే లేడని.. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణా రెడ్డి (సజ్జల) మాత్రమే అంటూ సంచలన కామెంట్లు చేస్తున్నారు. ‘‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’’ అంటూ అన్నకు మద్దతుగా రాజకీయ అరంగేట్రం చేసిన షర్మిల.. ఇప్పుడు అన్నపైనే బాణం గురిపెడుతున్నారు.
* ఇక లాభం లేదనుకున్నారో ఏమో..
ఓ ముఖ్యమంత్రిగా, అన్నగా మహిళపై కామెంట్లు చేయడానికి ఇప్పటి వరకు ఆచితూచి వ్యవహరించిన జగన్ కూడా పరోక్షంగా షర్మిలపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. నామినేషన్ వేసిన రోజున కడప జిల్లా పులివెందులలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ‘వైఎస్సార్ ఉనికి లేకుండా చేయాలనుకుంటున్న వారితో చేతులు కలిపిన వీళ్లా వైఎస్ వారసులు.. టీడీపీ కుట్రలో భాగస్వాములవుతున్న వీళ్లా వైఎస్ వారసులు..’ అని మండిపడ్డారు. అంతటితో ఆగలేదు. ‘పసుపు చీర కట్టుకుని.. వారి ఇళ్లకు వెళ్లి, వారి స్ర్కిప్టు మేరకు పని చేసే వీళ్లా వైఎస్ వారసులు’ అంటూ సంచలన కామెంట్లు చేశారు. జగన్ నాడు చేసిన కామెంట్లు రాజకీయ మంటలు రేపుతున్నాయి. దీనికి చెల్లి షర్మిల కూడా దీటుగా బదులిచ్చారు. ‘వేల మంది సభలో సొంత చెల్లెలు వేసుకున్న వస్త్రాల ప్రస్తావన తెస్తారా? జగన్ రెడ్డికి సంస్కారం ఉందా..?’ అని ప్రశ్నించారు. అలాగే.. ఓ సభలో జగన్ మాట్లాడుతూ.., తన చుట్టూ ప్రత్యర్థులు రాజకీయ పద్మవ్యూహం పన్నారని, వారి వ్యూహంలో చిక్కి బాణాలకు బలైపోవడానికి తాను అభిమన్యుడిని కాదనీ అర్జునుడిని అని వెల్లడించారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా చాలా అంశాల్లో అన్నాచెల్లెళ్ల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి.
మరోవైపు సునీత..
తండ్రిని హత్య చేసిన నిందితులను శిక్షించాలని కొంత కాలంగా పోరాటం చేస్తున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సైతం ఏపీ ఎన్నికల వేళ రాజకీయాల్లో కాక రేపుతున్నారు. షర్మిలకు మద్దతుగా కడపలో ప్రచారం చేస్తున్నారు. తన తండ్రిని చంపిన వారికి ఓటు వేయవద్దని చెబుతుండడమే కాకుండా, వివేకా హత్యకు కారణమైన వారికి మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం ఏంటి అంటూ.. జగన్‌ను ప్రశ్నిస్తున్నారు. తండ్రి హత్య గురైన రోజు అసలేం జరిగింది.., ఆ సమయంలో ఎవరు, ఎక్కడున్నారు.. సూత్రదారులెవరు.. పాత్రదారులెవరు.. అనే విషయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు.. మరోసారి వైసీపీకి ఓట్లు వేయవద్దని, ప్రధానంగా కడపలో ఆ పార్టీ అభ్యర్థిని ఓడించి తమకు న్యాయం చేయాలని ప్రచారం చేస్తూ.. ప్రధానంగా వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
సంచలనంగా తల్లుల పోటాపోటీ లేఖలు
జగన్, షర్మిల, సునీత, అవినాష్.. వీరే కాకుండా ఎన్నడూలేని రీతిలో ఈ ఎన్నికల్లో సునీత తల్లి, వివేకానంద రెడ్డి సతీమణి వైఎస్ సౌభాగ్యమ్య, ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మి కూడా వార్తల్లో నిలిచారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో తమ బిడ్డలకు అనుకూలంగా లేఖలు రాశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెళ్ళను హేళన చేస్తూ నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా అంటూ జగన్‌కు ఆయన చిన్నమ్మ, సౌభాగ్యమ్య లేఖ రాశారు.
ఈ లేఖకు ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మీ తాజాగా కౌంటర్ ఇచ్చారు. వివేకానంద రెడ్డి హత్యకు కారణమైన వారితో కలిసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘జగన్ మనోవేదన ఆరోజు మీకు గుర్తుకు రాలేదా సౌభాగ్యమ్మా? జగన్‌కి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మీరు రాజకీయ స్వార్థంతో విజయమ్మపై పోటీ చేసినప్పుడు వాళ్లు ఎంత బాధపడి ఉంటారు? మీ కుమార్తె సునీత నిజంగా న్యాయం కోసం పోరాటం చేస్తే కచ్చితంగా జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుంది.. శత్రువుల చేతిలో పావులుగా మారిన మీరు ఇప్పటికైనా తప్పును తెలుసుకోండి!’ అని లక్ష్మి రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మధ్యేమార్గంగా విదేశాలకు విజయమ్మ!
ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలబడుతున్న తన బిడ్డల్లో ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక జగన్, షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ విదేశాలకు వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించడంతో.. ఆమె వెంటే విజయమ్మ అడుగులో అడుగు వేసి నడిచారు. ఏపీ చీఫ్‌గా షర్మిల బాధ్యతలు తీసుకున్నాక.. మరోవైపు ముఖ్యమంత్రిగా కొడుకు జగన్ ముఖ్యమంత్రిగా ఉండడంతో సందిగ్ధంలో పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో కుమార్తెకు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తే.. కుమారుడికి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే కుమారుడికి కన్నతల్లిగా మద్దతు ఇచ్చి ఎన్నికల ప్రచారం చేపడితే.. కుమార్తెకు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని వైయస్ విజయమ్మ ఓ విధమైన ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో మధ్యేమార్గంగా ఫారిన్ టూర్ ప్లాన్ చేసుకొని ఆమె అమెరికా వెళ్లినట్లు తెలిసింది. మొత్తంగా చూస్తే ఈ ఎన్నికల్లో.. కూటమి, వైసీపీ పోరుకంటే .. అన్నాచెల్లెళ్లు.. మధ్యలో బాబాయి వివేకా హత్యా రాజకీయాలతో ఏపీ రాజకీయం.. వైఎస్ కుటుంబ కథా ‘‘చిత్రమ్’’.. యాక్షన్ థ్రిల్లర్ ను మరిపిస్తోంది.
—————————-