* ఈ గెలుపుతో మన గౌరవం పెరిగింది..
* దేశ చరిత్రలోనే అరుదైన అనుభవం ఈ ఎన్నికలు
* పోలవరం పూర్తిచేసే బాధ్యత నాది
* అమరావతే ఏపీ రాజధాని
* విశాఖ ఆర్థిక రాజధానిని చేస్తాం..
* ప్రజాతీర్పుతో బాధ్యత పెరిగిందని ఎమ్మెల్యేలకు హితవు
* కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
* ఎన్డీఏ సభాపక్షనేతగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా బాబు ఏకగ్రీవంగా ఎన్నిక
* ప్రతిపాదించిన పవన్.. బలపరిచిన పురందేశ్వరి
ఆకేరు న్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఢిల్లీలో ఏపీ ప్రతిష్ఠ పెరిగిందని తెలుగుదేశం అధినాయకుడు, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) తెలిపారు. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి పెద్దలు ఇచ్చిన గౌరవంతో ఆ విషయం అందరికీ తెలిసిందని చెప్పారు. తాను ఎన్నో ఎన్నికలు చూశానని, 93 శాతం సీట్లు రావడం దేశ చరిత్రలోనే అరుదైన అనుభవం ఈ ఎన్నికల ద్వారా లభించిందని చంద్రబాబు అన్నారు. 175కు 164 సీట్లు గెలిచామని, జనసేన 21కు 21, బీజేపీ 10కు 8 గెలిచి రికార్డు సాధించాయని తెలిపారు. ఎంపీ స్థానాల్లో ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారన్నారు. ఎన్డీఏ పక్షాల తరఫున ఎన్డీఏ శాసనసభాపక్షనేతగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన కూటమిపక్షాల శాసనసభాపక్ష సమావేశంలో ఈమేరకు ఆయనను ఎన్నుకున్నారు. ఆ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం(Polavaram) పూర్తిచేసే బాధ్యత తనది అని హామీ ఇచ్చారు. విభజన సమయంలో ముంపునకు గురయ్యే ఏడు మండలాలు ఏపీకి ఇవ్వకపోతే పోలవరం పూర్తవ్వదని, వాటిని ఏపీకి ఇవ్వకపోతే తాను ప్రమాణ స్వీకారం చేయనని, నాకీ పదవి వద్దని స్పష్టంగా చెప్పానన్నారు. అందుకే కేంద్రం వాటిని ఏపీకి కేటాయిస్తూ.. తొలి కేబినెట్ కు ముందే నిర్ణయించిందని గుర్తు చేశారు.
అమరావతే రాజధాని
మూడు రాజధానులు అంటూ ఆటలాడే పరిస్థితి ఉండదని, మన రాజధాని అమరావతే (Amaravati) అని స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిని చేస్తామని, అద్భుతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. విశాఖను రాజధాని చేస్తామని, జగన్ ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ ప్రచారం చేస్తే.. ఆయన ఇక్కడకు రావద్దని జనం మనకే ఓట్లు వేశారని గుర్తు చేశారు. అలాగే.. కర్నూలుకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నదులు అనుసంధానించి, ప్రతి ఎకరానికీ నీళ్లందిస్తామని తెలిపారు.
కక్షపూరిత రాజకీయాలొద్దు..
ఇది సమష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయమని, కక్షపూరిత రాజకీయాలు వద్దని ఎమ్మెల్యేలకు హితవు పలికారు. అలాగే.. తప్పు చేసినవాడిని క్షమించి వదిలిపెట్టినా అలవాటుగా మారుతుందని, వారికి చట్టపరంగా శిక్షపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. విధ్వంస రాజకీయాలు కాకుండా అన్నిటినీ ప్రక్షాళన చేయాలన్నారు. కక్షపూరిత రాజకీయాలు కాకుండా, నిర్మాణాత్మక రాజకీయాలు చేద్దామని తెలిపారు. ప్రజావేదిక మాదిరిగా కూల్చివేతలు ఉండబోవని హామీ ఇచ్చారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి అని ఎన్నికలకు వెళ్లామని, ప్రజలు గెలుపు ఇచ్చారని, రాష్ట్రం నిలబడేలా అందరూ కలిసి కృషి చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
పవన్ స్ఫూర్తిని ఎప్పటికీ మరచిపోలేను..
నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఈసారి మనకుండే ప్రాధాన్యం గతంలో ఎప్పుడూ లేదన్నారు. కూటమిని నిలబెట్టడంలో పవన్ (Pavan) స్ఫూర్తిని ఎప్పటికీ మరచిపోలేనని తెలిపారు. జైల్లో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా తనను పవన్ కలిశారని, బయటకు వచ్చి తెలుగుదేశం – జనసేన పొత్తు పెట్టుకుంటున్నాయని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు. ఆరోజు నుంచీ ఎటువంటి పొరపొచ్చాలూ లేకుండా పనిచేశామన్నారు. కూటమి ఎమ్మెల్యేలు అందరూ సమష్టిగా ప్రజల రుణం తీర్చుకోవాలని సూచించారు. ఈ రాష్ట్రానికి కేంద్రం సహకారం అవసరమని తాను కోరానని, పూర్తిగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారని తెలిపారు. దీనికి ప్రధాని మోదీ(PM Modi), అమిత్ షా (Amit Shah), నడ్డాకు (Nadda) కృతజ్ఞతలు తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో రాగద్వేషాలకు అతీతంగానే పనిచేశానని, ఇప్పుడూ అలాగే పని చేస్తానని తెలిపారు. కాగా, ఎన్డీఏ(NDA) సభాపక్షనేతగా బాబును పవన్ ప్రతిపాదించగా, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి (Purandeswari) బలపరిచారు. ఎన్డీఏ కూటమి విజయం స్ఫూర్తినిచ్చిందని పవన్ తెలిపారు.
——————