* పెట్టుబడికి రెట్టింపు లాభాలు ఉంటాయని వంచన
* కొల్లగొట్టిన ధనాన్ని క్రిప్టో కరెన్సీ రూపంలో ఇతరుల ఖాతాకు మళ్లింపు
* చెన్నైలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న వరంగల్ పోలీలులు
* ప్రతిభ కనబర్చిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
ఆకేరున్యూస్, వరంగల్ : దేశ వ్యాప్తంగా పెట్టుబడుల ముసుగుల్లో ప్రజలను నమ్మించి కోట్లల్లో కొల్లగొట్టిన ప్రజాధనాన్ని సైబర్ నేరగాళ్ల వ్యక్తిగత ఖాతాలకు మళ్లిస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన నిందితుడిని తెలంగాణ, వరంగల్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ అరెస్టు సంబంధించి వరంగల్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ విజయ్‌కుమార్ వివరాలను వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం చైన్నెయి ప్రాంతానికి చెందిన మరియా బెనెడిక్ట్(38) కొద్ది రోజులగా దేశ వ్యాప్తంగా ప్రజలను నమ్మించి పెట్టిన డబ్బుకు రెట్టింపు డబ్బు తిరిగి వస్తుందని మోసం చేసి కోట్లల్లో డబ్బు కొల్లకొడుతున్నాడు. నిందితులు పోలీసులకు చిక్కకుండా దోచుకున్న డబ్బు మరింత భద్రం చేసుకోనేందుకుగాను ఇతరుల ఖాతాకు మళ్లించేవారు. ఇలా నేరగాళ్లు మళ్లించిన డబ్బును నిందితుడు బ్యాంక్ నుంచి డబ్బును విత్‌డ్రా చేసేవాడు. ఇలా వచ్చిన డబ్బును నిందితుడు క్రిప్టో కరెన్సీ, డాలర్స్‌గా మార్చి తిరిగి సైబర్ నిందితులకు సంబంధించిన వ్యక్తిగత ఖాతాలకు జమ చేసేవాడు.
గత నెల హనుమకొండ నగరంలో పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్ల చేతుల్లో ముప్పై మూడు లక్షల యాబై వేల రూపాయల డబ్బు నష్టపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి అచూకీ కనిపెట్టి మంగళవారం చైన్నెయిలో అరెస్టు చేసి వరంగల్ కమిషనరేట్‌కు తరలించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన సైబర్ క్రైమ్ ఏసీపీ విజయ్‌కుమార్, ఇన్ స్పెక్టర్ రవికుమార్, ఎస్ఐలు చరణ్, శివకుమార్, ఏఏవో సల్మాన్ పాషా, రాజేష్‌రెడ్డి, కానిస్టేబుళ్లు అంజనేయులు, రాజును పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.
———————————–