* అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ముగ్గురి అరెస్ట్
* అరెస్టులో ట్విస్ట్.. చేసింది హైదరాబాద్ పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ఈ కేసులో నిందితుల విచారణకు ఢిల్లీ పోలీసులు నగరానికి చేరుకున్న తరుణంలో అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. వారి కంటే ముందుగానే రంగంలోకి దిగిన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు సోషల్మీడియా ఇన్చార్జి సతీష్ తో పాటు, నవీన్, తస్లీమాలను అరెస్ట్ చేశారు. సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. అయితే.. వీరిని ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆసక్తికరంగా నగర పోలీసుల ట్విస్ట్..
ఢిల్లీ పోలీసుల కంటే ముందుగానే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. ఈకేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా సతీశ్, నవీన్, శివకుమార్, అస్మా తస్లీమా లకు కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ అయిన సీఎం రేవంత్ రెడ్డి తీరిక లేకుండా ఉన్నందున నాలుగు వారాల గడువు కావాలని కాంగ్రెస్ లీగల్ సెల్ న్యాయవాదులు ఢిల్లీ పోలీసులను కోరుతూ లేఖ రాశారు. అలాగే, సతీశ్, మరో ముగ్గురికి రెండు వారాలు గడువు కావాలని కోరారు. అందుకు సంతృప్తి చెందని ఢిల్లీ పోలీసులు నేరుగా ఈరోజు హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్త గీత ఫోన్ ఇప్పటికే సీజ్ చేశారు. సికింద్రాబాద్ శాంతినగర్ కు చెందిన గీతకు 41ఏ నోటీసులు ఇచ్చి, ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈరోజు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు చేరగానే, వారికంటే ముందే ముగ్గురిని నగర పోలీసులు అరెస్ట్ చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
————————-