
* విచారణలో విషయం తెలిసి ముక్కున వేలేసుకున్న పోలీసులు
ఆకేరు న్యూస్, సిరిసిల్ల : ఆయనో ఏఎస్ఐ.. నెలనెలా మంచి జీతం.. అయినా ఓ ఇంట్లో చోరీకి యత్నించాడు. జనం ఉతికి ఆరేశారు. చితకబాది పోలీసులకు అప్పగించారు. తారా అతడు కూడా ఓ పోలీసు అని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. మహేశ్ అనే వ్యక్తి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల (Sircilla) మున్సిపల్ పరిధిలోని సర్థపూర్లో ఉన్న 17వ పోలీస్ బెటాలియన్లో ఏఎస్ఐ(ASI)గా పనిచేస్తున్నారు. అక్కడే ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. అయితే కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. దీంతో సోమవారం రాత్రి పట్టణంలోని ఓ ఇంట్లో దూరి, చోరీకి యత్నించాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్నవారికి పట్టుబడ్డాడు. దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. ఆయన దొంగగా మారడం వెనుక కారణాలేంటి, చోరీ యత్నం వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
……………………………………………………..