* ఎమ్మెల్యే అరెస్టుతో శైలజ స్వగ్రామంలో ఉద్రిక్తత
* ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి అంటూ హరీశ్ ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కలుషిత ఆహారం తిని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని శైలజ మృతి చెందడంతో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా(ASIFABAD DISTRICT)లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు గ్రామాన్ని తమ వలయంలోకి తీసుకుని భద్రత ఏర్పాటు చేశారు. శైలజ మృతదేహాన్ని నిమ్స్ నుంచి స్వగ్రామానికి తరలించారు. దీంతో అర్ధరాత్రి ఆసిఫాబాద్, వాంకిడిలో ఉద్విగ్న పరిస్థితులు ఏర్పడ్డాయి. శైలజ మృతికి ప్రభుత్వమే కారణమంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. బీఆర్ ఎస్(BRS) నేతలు వారికి మద్దతు పలికారు. పోలీసులు బంధువులు, ఆదివాసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. దాబా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామానికి బయల్దేరిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA KOVA LAXMI)ని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో.. పోలీసుల తీరును నిరసిస్తూ.. ఆమె ఇంటి ఎదుట ధర్నాకు దిగారు.
పోలీసుల తీరు.. ఎమ్మెల్యే హౌస్ అరెస్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు(HARISHRAO) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల విద్యార్థిని మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని చెప్పారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం అంటూ దేశ వ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటున్నాం కానీ, ఆ రాజ్యాంగ సూత్రాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా తుంగలో తొక్కుతున్నదని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు, ప్రజా ప్రతినిధుల హౌజ్ అరెస్టులు, మీడియాపై కఠిన ఆంక్షలని విమర్శించారు. ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి (REVANTHREDDY) అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.
……………………………………………