సహజీవనం చేస్తున్న జంట ఆత్మహత్య
ఆకేరు న్యూస్, బెంగళూరు: ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నారు. కానీ ఏమైందో ఏమో గానీ, ఆ జంట తనువు చాలించింది. ఒకరి మరణాన్ని తట్టుకోలేక మరొకరు బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్న ఘటన బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది.
*ఇక వివరాలోకి వెళ్తే:
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన కుంట్ల బాబు రెడ్డి (32) బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతను కొత్తనూరులోని ఒక అపార్ట్మెంట్లో మనీషా (31) అనే యువతితో గత కొంతకాలంగా సహజీవనం (Live-in relationship) చేస్తున్నాడు.
సోమవారం బాబు రెడ్డి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బయటకు వెళ్లి వచ్చిన మనీషా, గదిలో వేలాడుతున్న బాబు రెడ్డి మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయింది. తన కళ్లముందే ప్రియుడు విగతజీవిగా పడి ఉండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, వెంటనే అదే అపార్ట్మెంట్ 17వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
*సూసైడ్ నోట్ లభ్యం:
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. బాబు రెడ్డి రాసినట్లుగా భావిస్తున్న ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తన మరణానికి ఎవరూ కారణం కాదని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
పోలీసుల విచారణ
వీరిద్దరి సహజీవనం గురించి ఇరు కుటుంబ సభ్యులకు తెలుసా? లేదా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఎంతో కాలంగా కలిసి ఉంటున్న ఈ జంట ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల బలమైన కారణాలేంటనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కరోజు వ్యవధిలోనే ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
