ఆకేరు న్యూస్ డెస్క్: బంగ్లాదేశ్ లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. చీఫ్ జస్టిస్ హసన్ తప్పుకోవాలని ఈరోజు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అంతేకాదు.. అందుకు డెడ్‌లైన్ విధించారు. చీఫ్ జస్టిస్‌తో పాటు అపిల్లేట్ డివిజన్ జడ్జీలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజీనామా చేయాలని విద్యార్థులు హెచ్చరించారు. ఒకవేళ తప్పుకోని పక్షంలో.. వారి ఇండ్లపై దాడులు చేయనున్నట్లు విద్యార్థులు బెదిరించారు. యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూమెంట్ కు చెందిన కోఆర్డినేటర్ హస్నత్ అబ్దుల్లా ఈ అల్టిమేటమ్ జారీ చేసినట్లు తెలిసింది. అయితే జడ్జీల భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని తన పోస్టుకు రాజీనామా చేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ ఇవాళ జర్నలిస్టులకు తెలిపారు. రాజీనామా చేసేందుకు కొన్ని ఫార్మాల్టీలు ఉన్నాయని, వాటిని పూర్తి చేస్తున్నామని, దేశాధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దిన్కు రాజీనామా లేఖను పంపనున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన హింస, అల్లర్ల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లారు. ఆ తర్వాత అక్కడ యునిస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఫుల్ కోర్టు నిర్వహించడంతో మరోసారి అల్లర్లు చెలరేగాయి.
——————————