.* నిర్లక్ష్యానికి, అలసత్వానికి, ఆలస్యానికి తావు ఇవ్వొద్దు
* సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండాలి
* జలవిద్యుత్ కేంద్రాల్లో గరిష్ట విద్యుత్ ఉత్పత్తిని సాధించాలి
* థర్మల్, హైడల్ విద్యుత్తు ఉత్పాదన శాఖలపై భట్టి సమీక్ష
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : విద్యుత్ శాఖ అంటే 24/7 పనిచేసే శాఖ అని గుర్తుంచుకోవాలని, నిర్లక్ష్యానికి, అలసత్వానికి, ఆలస్యానికి తావు ఇవ్వొద్దు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. జలవిద్యుత్ కేంద్రాల్లో గరిష్ట విద్యుత్ ఉత్పత్తిని సాధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క థర్మల్, హైడల్ విద్యుత్తు ఉత్పాదనకు సంబంధించిన ఆ శాఖల సీఈలతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి ప్లాంట్లో కనీసం 17 రోజుల విద్యుత్ ఉత్పాదనకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే వినేందుకు, వాటిని పరిష్కరించేందుకు 24 గంటల పాటు తాను అందుబాటులో ఉంటానని డిప్యూటీ సీఎం.. విద్యుత్ శాఖ మంత్రి అధికారులు, సిబ్బందికి భరోసా ఇచ్చారు. విద్యుత్ ఉత్పాదనలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. సకాలంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల గతంలో శ్రీశైలం, జూరాల వంటి హైడల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తద్వారా ఏర్పడిన నష్టాన్ని గుర్తు చేశారు. అధికారులకు ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రాజెక్టులకు సంబంధించి సీఈలు నిర్లక్ష్యం వహించినట్లుగా ఉంటే రాతపూర్వకంగా వారి నుంచి వివరణ తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
————————————