
* అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు
* రేషన్ కార్డు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది
* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: రాష్ట్రంలోని అంగన్వాడి, ఆశా వర్కర్ల సమస్యలను విడతలవారీగా పరిష్కరించడానికి కృషి చేస్తానని, బతుకమ్మ పండుగ మహిళలకు ఎంతో గొప్పదని రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం జిల్లా కేంద్రం లోని డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో అంగన్వాడి టీచర్లకు, ఆయాలకు అదనపు కలెక్టర్ సి.హెచ్.మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలిసి మంత్రి ఏకరూప దుస్తులను (యూనిఫామ్) పంపిణీ చేశారు. మొదట గిరిజన భవన్ లో ములుగు, మల్లంపల్లి మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భాల్లో మంత్రి మాట్లాడుతూ అంగన్వాడి పాఠశాలలను మూసివేసే అవకాశం ఉందని ప్రచారంలో నిజం లేదని, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అదనంగా పాఠశాలలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారని వివరించారు. నూతన పాఠశాలలను ఏర్పాటు చేయడమే కాకుండా కారుణ్య నియామకాలు చేపట్టడానికి సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారని, అంగన్వాడి సెంటర్ లో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతాయుతంగా విధులను నిర్వహిస్తూ పిల్లలకు మంచి పౌష్టికాహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడి సిబ్బంది తమ స్వంత పిల్లలు లాగానే చూసుకోవాలని, ఏకరూప దుస్తులు అందని సిబ్బందికి త్వరలో అందజేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ సహకారంతో మహిళా సంఘాల సభ్యులు విజయవంతంగా పలు వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారని అన్నారు. సోలార్ ప్లాంట్లు, ఆటోలు, వాహనాలు, బస్సుల కొనుగోలు కోసం బడ్డీలేని రుణాలను అందజేస్తు న్నామని, వీటిని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదుగుతున్నారని తెలిపారు. ప్రతి మహిళా సంఘంలో చేరి ప్రభుత్వం అందించే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు పది మందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగాయని అన్నారు. ములుగు నియోజకవర్గంలో అర్హులకు పదివేల కు పైగా రేషన్ కార్డులను పంపిణీ చేశామని, నూతన కార్డులను పంపిణీ చేయడమే కాకుండా వారికి సన్న బియ్యం అందిస్తున్నామని, రాష్ట్రంలోని పేదలందరికీ 200 యూనిట్ల ఉచిత కరెంటు అందజేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రభుత్వానికి అండగా నిలవాలని సీతక్క కోరారు. అనంతరం డి ఎల్ ఆర్ గార్డెన్ లో మహిళలు, గెజిటెడ్ సంఘం ఏర్పాటు చేసిన బతుకమ్మ లతో మహిళల తో కలసి మంత్రి బతుకమ్మ ఆడినారు. ఈ కార్యక్రమంలో డి డబ్ల్యూఓ తుల రవి, డి సి ఎస్ ఓ షా ఫైజల్ హుస్సేనీ, ప్రజా ప్రతినిధులు, సిడిపిఓలు, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, రేషన్ కార్డు లబ్ధిదారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………………