* వేడుకలే విషాదమవుతున్న వేళ …!
* కేక్‌లల్లో సింథటిక్ స్వీట్నర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పంజాబ్ రాష్ట్రంలోని పటియాలకు చెందిన మాన్వి (Manvi ) అనే పదేళ్ల బాలిక.. పుట్టిన రోజే చివరి రోజైన విషాద ఘటన. సంతోషంగా పుట్టిన రోజున కేక్ ( Birth day Cake ) తిని ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన కేక్‌ల వాడకం పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. కేక్‌లో సింథటిక్ స్వీట్నర్లు ( synthetic sweetener ) అనే రసాయనాన్ని అధిక మోతాదులో కలపడం వల్లే మాన్వి బలైపోయిందని తేలింది. విచిత్రం ఏమిటంటే కేక్‌ల పట్ల ఎన్ని ఫిర్యాదులు వున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక్క పుట్టిన రోజు వేడుకే కాదు, సంబరం ఏదైనా సరే కేక్ కట్ కావాల్సిందే. కేక్‌లు.. కేకలు లేకుండా ఏ సెలబ్రేషన్ సంపూర్ణం కావడం లేదు. చిన్నారుల నుంచి వయోధికుల వరకు కేక్‌లతో ఉండే అనుబంధం అంతా ఇంతా కాదు. ఒకరికొకరు తినిపించుకొని ఆనందం పంచుకోవడం ఒక పద్ధతి అయితే, కట్ చేసిన కేక్‌లను ముఖాలకు పులమడం కొన్నాళ్లుగా బాగా పెరిగిపోయింది. కూల్, నార్మల్ రకాల్లో అనేక ఫ్లేవర్ల కేక్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.
* తీయని విషం
కేక్‌ల తయారీలో చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడుతున్న రసాయనాలు (స్వీట్నర్లు) ఆందోళన కలిగిస్తున్నాయి. సచ్చారిన్, అస్పార్టేమ్, సుక్రలోజ్, ఏస్-కె వంటి పేర్లతో వున్న కృత్రిమ స్వీట్నర్ల వాడకం ఈ మధ్య పెరిగిపోయింది. వాస్తవానికి ఈ కృత్రిమ స్వీటనర్లలో క్యాలరీలు అతి తక్కువగా ఉంటాయి. ఒకరకంగా ఇవి ఒబేసిటీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాదు, బ్లడ్ షుగర్, ఇన్సులిన్ ఉత్పత్తిని నియంత్రించడానికి ఉపయోపడతాయి. ఇవి సాధారణ చక్కెర కన్నా 200 నుంచి 600 రెట్ల వరకు తీయదనం కలిగిఉంటాయి. వీటిని ఒక మోతాదు వరకు మాత్రమే వాడాలి. కానీ బేకింగ్ పరిశ్రమల వారు సరైన పర్యవేక్షణ లేకుండా కృత్రిమ స్వీట్నర్లను ఇష్టారాజ్యంగా వాడి బేకరీల ద్వారా విక్రయిస్తున్నారు.
వాస్తవానికి ఇండియాలో బేకరి ఉత్పత్తుల తయారీ యూనిట్లు కుటీర పరిశ్రమ వలె సాగుతుంటాయి. వీటిలో పాటించే ప్రమాణాలపై అధికారుల పర్యవేక్షణ కనిపించదు. పదార్థాల నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ( Food safety Officers ) తనిఖీలు జరపడం అరుదు. ఈ-కామర్స్ విస్తరించిన తర్వాత ఆన్లైన్లో కేక్‌ల ఆర్డర్లు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కేక్‌లను ఎవరు ఎక్కడ తయరు చేస్తున్నారో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితులను ఆసరా చేసుకున్న తయారీదారులు కేక్‌లలో పరిమితికి మించి కృత్రిమ స్వీటనర్లను గుప్పిస్తున్నారు.
సాధారణంగా కేక్‌లు తిన్న తర్వాత చాలామంది స్వల్ప అస్వస్థతకు గురవుతున్నారనే ఫిర్యాదులు వున్నా, అవి సీరియస్ గుర్తింపునకు నోచుకోవడం లేదు. కొన్ని ఘటనల్లో మరణాలు సంభవించినా, అవి విషప్రయోగం వంటి అనుమానాల జాబితాలో చేరుతున్నాయి. అధిక మోతాదులో కృత్రిమ స్వీట్నర్లను వినియోగించి తయారుచేసిన కేక్‌లను గుర్తించడం వినియోగదారులకు సాధ్యం కాదు. కాబట్టి వీటి వాడకాన్ని నియంత్రించే బాధ్యత ప్రభుత్వాలదే. అది ఆచరణలోకి వచ్చే వరకు కేక్‌ల ప్రియులు అప్రమత్తంగా ఉండటం ఒక్కటే పరిష్కారం.
కేక్‌లు తినడం కేక్వాక్ అంత సులభం కాదు. అదీ .. తీయని విషం లాంటిదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. . తస్మాత్ జాగ్రత్త!!
——————————