
* సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ బాధితులే
* తాజాగా జాబితాలో స్టార్ హీరో ఉపేంద్ర
* ప్రతి నెలా 140 కోట్ల మంది వివరాల హ్యాకింగ్
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
ఫోన్ మన చేతిలోనే ఉందిలే ఏం కాదు.. అని అనుకునే రోజులు పోయాయి. తెలియకుండానే మన ఫోన్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. సమస్త సమాచారం వారికి చేరిపోతోంది. బ్యాంకు ఖాతాలు తారుమారవుతున్నాయి. డబ్బు చోరీకి గురవుతోంది. వ్యక్తిగత సమాచారమూ బహిర్గతం అవుతోంది. దాన్ని ఆసరాగా చేసుకుని బెదిరింపులు మొదలవుతున్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి అప్పులు చేసి మరీ సైబర్ నేరగాళ్లకు సమర్పించుకోవాల్సి వస్తోంది. డిజిటల్ ప్రపంచంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సైబర్ బాధితులుగా మారుతున్నారు. ప్రతి నెలా 140 కోట్ల మంది వివరాలు హ్యాకింగ్ అవుతున్నాయంటే జరుగుతున్న, జరగబోతున్న పెను ప్రమాదాన్ని ఊహించుకోవచ్చు.
అందరూ బాధితులే..
కూలీ సినిమాలో తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకుని విజయాన్ని అందుకున్న ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర, ఆయన భార్య ప్రియాంక కూడా సైబర్ నేరగాళ్ల బాధితులు అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఉపేంద్రే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ అభిమానులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ఎలా జరిగిందో వివరించారు. ఉపేంద్ర భార్య ప్రియాంకకు ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఆర్డర్ చేసిన వస్తువు డెలివరీ కోసం కాల్ చేస్తున్నట్లు నమ్మబలికాడు. డెలివరీ ప్రక్రియ పూర్తి కావాలంటే కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లు, నంబర్లను ఫోన్లో ఎంటర్ చేయాలని సూచించాడు. అది నిజమని నమ్మిన ఆమె, అవతలి వ్యక్తి చెప్పినట్లే చేయడంతో ఫోన్ హ్యాకింగ్‌కు గురైందని ఉపేంద్ర తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తన ఫోన్ కూడా హ్యాక్ అయిందని ఆయన వివరించారు. ఇలా ఉపేంద్ర దంపతులే కాదు, సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖల వరకూ చాలా మంది బాధితులవున్నారు.
డిజిటల్ చౌర్యాలు రెండు రకాలు
రెండు రకాల డిజిటల్ చౌర్యాలు ఉంటున్నాయని… ఒకటి పరోక్ష విధానం, రెండోది ప్రత్యక్ష విధానంగా సీఎస్సీ ప్రకటించింది. వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా ఇంటర్నెట్ వినియోగదారులకు తెలియకుండా వివరాలను సేకరించడం పరోక్ష విధానం కాగా.. ప్రత్యక్ష విధానంలో నెటిజన్లు ఫొటోలు, వీడియోలు, కామెంట్లను ఇంటర్నెట్లో పెట్టినప్పుడు వారి వివరాలను సేకరిస్తారు. క్లిక్ చేస్తే చాలు.. ఇంటి ముంగిటకే అంటూ ఉత్సాహంగా చేసే కొనుగోళ్లలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం పొంచి ఉందనే విషయం అర్థం అవుతోంది. ఆన్లైన్లో మనం చేసే ప్రతి లాగిన్, పోస్ట్, సంప్రదింపులు సైబర్ నేరగాళ్ల బారిన పడడానికి ఆధారం అవుతున్నాయి. ఆన్లైన్లో మనం చేసే ప్రతి లాగిన్, పోస్ట్, సంప్రదింపుల ద్వారా నేరాలు కొనితెచ్చుకున్నట్లు అవుతోంది.
ప్రతీ నెలా 140 కోట్ల డిజిటల్ ఖాతాలు హ్యాకింగ్
తాజాగా యూఏఈ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ (సీఎస్సీ) ప్రకటించిన నివేదికను పరిశీలిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నెలా 140 కోట్ల మంది డిజిటల్ ఖాతాల వివరాలు హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. కాగా అనధికారిక, నమ్మదగని అప్లికేషన్లు పెద్ద ప్రమాదంగా ఉన్నాయని సీఎస్సీ పేర్కొంది. వీటిలో కొన్ని వినియోగదారులకు తెలియకుండా కాల్ రికార్డింగ్ చేయదగ్గ, కెమెరాని యాక్సెస్ చేయగల సామర్థ్యంతో ఉంటున్నాయని పేర్కొంది. అందువల్ల అధికారిక యాప్ స్టోర్ల నుంచే యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలని సీఎస్సీ పేర్కొంది. యాప్ పర్మిషన్లను తనిఖీ చేసుకోవాలని, టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉండాలని తెలిపింది. అలాగే లొకేషన్ షేర్ చేసేటప్పుడు, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను ఓకే చేసేటప్పుడు జాగ్రత్త అవసరమని పేర్కొంది.
……………………………….