* డిగ్రీ పట్టాలతో రోడ్డెక్కుతున్న స్కిల్ లేని విద్యార్థులు
* బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నాణ్యతలేని విద్యను బోధించే ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపును రద్దు చేయడంలో వెనకాడమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇంజనీరింగ్ పట్టభద్రులకు సబ్జక్టుపై కనీస పరిజ్ఞానం కూడా లేకుండా పట్టా తీసుకుంటున్నారన్నారు. ఇలాంటి వారికి ఉద్యోగాలు దొరకడం లేదని.. స్కిల్స్ లేకుండా వస్తున్న విద్యార్థుల కారణంగా వారు ఎక్కడా రాణించలేకపోతున్నారన్నారు. అందుకే యువతకు స్కిల్స్ నేర్పే క్రమంలో స్కిల్ వర్సిటీని ప్రారంభించామన్నారు. దీనికి మహింద్రా కంపెనీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అధినేతగా ఉంటారని.. తెలంగాణ అభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలన్నదే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాసబ్‌ట్యాంక్‌లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ ప్రారంభించిన సీఎం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో ఉన్న యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పని చేస్తుందని.. విద్యా బుద్దులు నేర్చుకుని ఉపాధి అవకాశాలతో పేరు తీసుకురావాల్సిన యువత పక్కదారి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, ఇతర డ్రగ్స్ మత్తులో ఊగుతోందని ఆందోళన చెందారు. డ్రగ్స్ కల్చర్ చాలా ప్రమాదకరంగా మారుతోందన్నారు రేవంత్. ముఖ్యంగా బీటెక్ విద్యార్థులు ఈ డ్రగ్స్ బారిన ఎక్కువ పడుతున్నారని.. ఇది మరింత ఆందోళన కరమన్నారు. వారు డ్రగ్స్ వాడటమే కాకుండా పెడ్లర్స్‌లా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లా ఇంజినీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ బారిన పడటానికి కాలేజీలు కూడా ఓ కారణమని ఆరోపించారు. విద్యాబోధన సరిగా లేకపోవడం, కాలేజీలో పట్టించుకునే వాళ్లు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి వస్తోందని అన్నారు. అందుకే కచ్చితంగా వీటిపై దృష్టి పెట్టాలని కాలేజీలకు సూచించారు. విద్యాబోధనపై దృష్టి పెట్టకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అవసరమైతే కాలేజీ గుర్తింపు కూడా రద్దు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రభుత్వం తరఫున యువతకు ఎన్ని విధాలుగా సాయం చేయాలో అన్ని విధాలుగా సాయం చేస్తున్నామని వాటిని అందిపుచ్చుకొని ఎదగాలని సీఎం సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే ప్రైవేటు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి కోర్సులు చదవాలి ఏ విభాగంలో స్కిల్ డెవలప్మెంట్ చేయాలో కూడా పరిశ్రమలతో చర్చిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను గుర్తించి అన్ని శాఖల్లో భర్తీ పక్రియ చేపట్టామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. మాసబ్‌ట్యాంక్‌లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్‌ను సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా వినూత్న కోర్సుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా స్కిల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోదు. దీని తీవ్రతను మా ప్రభుత్వం గుర్తించింది. ఏటా 3లక్షల మంది పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారు. ఉపాధి అవకాశాలపై పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడాం. ఎలాంటి కోర్సులు చదివిన వారు కావాలని వారిని అడుగుతున్నాం. నిరుద్యోగ యువత డిమాండ్`సప్లయ్ సూత్రం గుర్తుంచుకోవాలి. డిగ్రీ చదివేవారు భవిష్యత్తు దిశగా ఆలోచించాలి. కొందరు విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడం లేదు. బ్యాంకులు, బీమా రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. నాయకుడిగా రాణించాలన్నా నైపుణ్యం ఉండాలి. ఉద్యోగాలు, ఉపాధి లేకుంటే చెడు వ్యసనాల వైపు వెళ్లే ప్రమాదం ఉంది. బీటెక్ చదివిన వారు కూడా డ్రగ్స్ విష వలయంలో చిక్కుకుంటున్నారు. ఈ సమస్య నిర్మూలనకు కార్యక్రమం చేపట్టాం. ప్రభుత్వం ఒక్కటే దీన్ని పరిష్కరించలేదు. అందరూ కలిస్తేనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యం. మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలి. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు జాబ్ స్కిల్స్ నేర్చుకోవడం లేదు. కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు, వసతులు ఉండటం లేదు. కళాశాలలు ఇలాగే కొనసాగితే గుర్తింపు రద్దు చేసేందుకు వెనుకాడం. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడవిూ ఏర్పాటు చేస్తాం. టీజీపీఎస్సీ వెబ్సైట్లో 30లక్షల మంది నమోదు చేసుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా 60లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. డీఎస్సీ, గ్రూప్స్ విభాగాల్లో మరో 35వేల ఉద్యోగాల భర్తీ చేపట్టాం. త్వరలో మరో 35వేల పోస్టులు భర్తీ చేస్తాం. ఎంత చదువుకున్నా నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
………………………….