
* చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి
* కాంగ్రెస్ సర్కార్లో రైతు సంక్షేమానికి పెద్దపీట
* ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
ఆకేరున్యూస్, భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతితో రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని ఎమ్మెల్యే గండ్ర సత్యానారాయణరావు అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ, గోరి కొత్తపల్లి మండలాల్లో రైతు వేదికల్లో నిర్వహించిన భూ భారతి అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా భూమి సాగుచేసుకుంటున్నా పట్టాలు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, భూ భారతి చట్టంతో అలాంటి రైతులకు పట్టాదారు పాసుపుస్త కాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. దరణిలో అప్పీలు చేసుకునే అవకాశం లేకపోవడం వల్ల ప్రజలు సివిల్ కోర్టులకు వెళ్లాల్సి వచ్చేదని, దానివల్ల ఎన్నో వ్యవప్రయాసలు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేసి ప్రజలకు సులువుగా భూ హక్కులు కల్పించే చట్టాన్ని తెస్తామని ప్రకటించామని, ఇచ్చిన మాట మేరకు ఈ 14న డా బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భూ భారతి చట్టం అందుబాటులోకి తెచ్చామని అన్నారు. చట్టంపై ప్రజలకు అవగాహన కల్పనకు అన్ని మండలాల్లో భూ భారతి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం పైలెట్ ప్యాజెక్టు క్రింద ఎంపిక చేసిన మండలాల్లో రైతులతో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ రైతుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని, రైతులు ఇచ్చిన సలహాలు, సూచనలు పరిశీలించి చట్టంలో చేర్చనున్నట్లు తెలిపారు. ధరణితో రెవెన్యూ అధికారులు, ఇటు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని కొందరైతే ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. భూమిని నమ్ముకున్న ప్రతి రైతుకు అన్ని హక్కులు కల్పించి వ్యవసాయ పనిముట్లుకు రాయితీ ఇవ్వనున్నామని స్పష్టం చేశారు. సన్నరకం ధాన్యానికి నియోజకవర్గంలో రూ.30 కోట్లు బోనస్ ఇచ్చామని తెలిపారు. అలాగే రూ. 380 కోట్లు రుణమాఫీ జరిగినట్లు తెలిపారు. భూ భారతి చట్టం వల్ల రైతులకు మేలు జరుగుతుందని వివరించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ దరణిలో మూటేషన్ లో అభ్యంతరాలకు అప్పీలు చేయడానికి అవకాశం ఇవ్వలేదని, కానీ భూ భారతిలో.అప్పీలు చేయడానికి అవకాశం కల్పించారని అన్నారు. తహసీల్దార్ నుండి రెవిన్యూ డివిజనల్ అధికారికి, ఆపై జిల్లా కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చునని, ల్యాండ్ ట్రిబ్యునల్ కు వెళ్ళడానికి అవకాశం కల్పించారని తెలిపారు. ధరణి చట్టం ప్రకారం సొంత డాక్యుమెంట్ వ్రాసుకోవడానికి అవకాశం లేదని, సర్వే మ్యాప్ లేదని, మ్యుటేషన్ పై అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు వెళ్లడం తప్ప అప్పీల్ చేయడానికి అవకాశం లేదని తెలిపారు. ధరణి చట్టం ప్రకారం, కోర్టు ద్వారా భూమి హక్కులు సంక్రమించినప్పుడు తప్ప మరే విధంగా హక్కులు సంక్రమించినా మ్యుటేషన్ చేసే అవకాశం లేదని తెలిపారు. మ్యూటేషన్ ప్రక్రియలో ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుండి రెవిన్యూ డివిజనల్ అధికారులు పెండిరగ్ ఉన్న దరఖాస్తులపై నోటీసులు జారీ చేసి విచారణ చేస్తారని అన్నారు. స్థానిక విచారణ చేసి చుట్టు ప్రక్క రైతులను విచారించి. మౌఖిక, వ్రాత పూర్వక ఆధారాలను పరిశీలిస్తారని, పి.ఓ.టి., సీలింగ్, ఎల్ టి ఆర్ చట్టాల ఉల్లంఘన లేదని నిర్ధారించుకున్న తదుపరి క్రమబద్దీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుని హక్కుల రికార్డులో నమోదు చేసి పట్టాదారు పాసుపుస్తకం ఇస్తారని అన్నారు. ధరణి చట్టంలో సాదా బైనామాల క్రమబద్దీకరణ కోసం ఎలాంటి నియమాన్ని పొందు పరచలేదని, హైకోర్టు సాదా బైనామాల క్రమబద్దీకరణపై స్టే విధించినట్లు పేర్కొన్నారు. భూమి హక్కుల రికార్డులోని వివరాలను ఈ రికార్డులో ఆన్లైన్ ద్వారా పొందుపరుస్తారని, మ్యుటేషన్ జరిగిన ప్రతి సారి ఆన్లైన్లో గ్రామ లెక్కలలో మార్పులు జరుగుతాయని, ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న ఈ గ్రామ రెవిన్యూ రికార్డులను ప్రింట్ తీసి భద్రపరుస్తారని వివరించారు.
…………………………………………………………..