
* తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు
* కుటుంబ పార్టీలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం!
* కేసీఆర్ మౌనం వ్యూహాత్మకమా.. ఎవరికీ నచ్చచెప్పలేకనా?
ఆకేరు న్యూస్(ప్రత్యేక ప్రతినిధి), హైదరాబాద్ :
తెలంగాణ ప్రజల కోసం రాజకీయ గొంతుగా ఆవిర్భవించిన పార్టీ.. 25 ఏళ్లుగా ఏకైక వ్యక్తి శాసిస్తున్న పార్టీ.. ఆ పార్టీలో అధినేత మాట శాసనం.. ఆయన ఆజ్ఞ శిరసావాహనం.. ఇప్పటి వరకు పార్టీలో నిరసన గళం వినిపించిన దాఖలాలు లేవు.. వినిపించిన వాళ్లకు పార్టీలో ఉండే అవకాశం లేదు. ఆ పార్టీ ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటది. అదే ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి. అటువంటి బీఆర్ ఎస్ లో పార్టీ చీఫ్ కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీ వజ్రోత్సవ సభ నిర్వహణ తీరుపై ఆమె కేసీఆర్ కు రాసిన లేఖ బహిర్గతం అయినప్పటి నుంచి తాజాగా సోదరుడు కేటీఆర్ పై పరోక్షంగా చేసిన వ్యాఖ్యల వరకూ అన్నీ చర్చనీయాంశమే. దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.
కవిత Vs కేటిఆర్
బీఆర్ఎస్ లో ఏర్పడిన తాజా పరిణామాల నేపథ్యంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మీడియాతో చిట్ చాట్ లో కవిత నిన్న మాట్లాడుతూ.. కేసీఆర్ నీడలో పని చేస్తున్న వారు తనపై కుట్రలు చేస్తున్నారని, ఇంటి ఆడబిడ్డపై ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని పేర్కొనడంతో ఆమె పరోక్షంగా కేటీఆర్ పైనే విమర్శలు చేశారని అర్థం అవుతోంది. ఈక్రమంలో కుటుంబ పార్టీగా పేరొందిన బీఆర్ ఎస్ బీటలు తప్పవనే చర్చలు జరుగుతున్నాయి. కుటుంబంలోనే రెండు వర్గాలు ఉన్నాయన్న సంకేతాలు పార్టీలోకి వెళ్లాయి. ఒకరు కేటీఆర్ అయితే.. మరొకరు కవిత. ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ కేసీఆర్ బిడ్డలే. ఒకవేళ పార్టీలో బీటలు ఏర్పడితే కేసీఆర్ ఎటువైపు అనే ఉత్కంఠ ఏర్పడింది. కొద్ది రోజులుగా కవిత ఎపిసోడ్ నడుస్తున్నా కేసీఆర్ స్పందించలేదు. ఖండించలేదు. వ్యక్తిగతంగా కవితతో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. కానీ, అధికారికంగా ధ్రువీకరణ లేదు.
కెసిఆర్ చేయి దాటిపోతుందా?
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రజ్వలింపచేసి, అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్.. కుటుంబంలోని కొడుకు, కుమార్తెను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇన్ని రోజులుగా సీరియస్ గా దృష్టి సారించలేదా.. సారించినా సాధ్యం కాలేదా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుగుబాటుపై ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా.. అన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. అయితే.. కవిత విషయంలో ఎవరూ స్పందించవద్దని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినా, కొంత మంది స్పందించడం చూస్తే.. పార్టీ ఆయన చేతులు కూడా దాటిపోతోందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కవిత కాకుండా మరొకరు పార్టీపై విమర్శలు చేస్తే కేసీఆర్ ఉపేక్షించేవారా అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే రాజకీయాల్లో తల పండిన కేసీఆర్.. పార్టీలోను, కుటుంబంలో తలెత్తిన వివాదాలపై తక్షణం స్పందించకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారని, త్వరలో తనదైన శైలిలో బాంబు పేల్చుతారనే చర్చలూ నడుస్తున్నాయి.
బీటలు తప్పవా?
ఇక కవిత విషయానికి వస్తే.. తనపై పార్టీలోనే కుట్రలు పన్నుతున్నారని సూటిగా చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో మా పార్టీ వాళ్లే ఓడించారని అన్నారు. అయినా తాను బీఆర్ ఎస్ పార్టీ నేతనని, తన నాయకుడు కేసీఆర్ మాత్రమే అని చెప్పారు. తాను ఇంకెవరి ఆదేశాలనూ పాటించనని తెలిపారు. అసలే నా నోరు మంచికాదని, తన జోలికి వస్తే బాగోదని కూడా హెచ్చరించారు. పార్టీ సోషల్ మీడియా వేదికగా తనను టార్గెట్ చేశారని వాపోయారు. దీన్ని బట్టి చూస్తే బీఆర్ ఎస్ లోనే కవిత వ్యతిరేక వర్గం ఉందని అర్థం అవుతోంది. దీంతో కవిత కూడా తన వర్గాన్ని పెంచుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే సింగరేణి జాగృతిని ఏర్పాటు చేశారు. సింగరేణి కాలరీస్ లో ఇప్పటికే తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య బీఆర్ఎస్ కు అనుబంధంగా పనిచేస్తున్నది. దీనికి పోటీగా సింగరేణి జాగృతిని ఏర్పాటు చేస్తూ, 11 ప్రాంతాలకు కో ఆర్డినేటర్లను నియమించారు కవిత. ఇకనుంచి జాగృతి తరఫున ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. యువతకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఇవన్నీ గమనిస్తే బీఆర్ ఎస్ లో బీటలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అంత వరకూ రాకుండా కేసీఆర్ ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెడతారని కొందరు భావిస్తున్నారు. ఈక్రమంలో మున్ముందు ఏం జరగనుందో, తెలంగాణ రాజకీయాలు ఎటువైపు టర్న్ తీసుకుంటాయో ఉత్కంఠ ఏర్పడింది.
……………………………………..