* సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
ఆకేరు న్యూస్, సిద్దిపేట : హైదరాబాద్ కొండాపూర్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi kaushikreddy)ని పరామర్శించేందుకు ఆయన నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harishrao)ను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 3 గంటల పాటు స్టేషన్లోనే ఉంచారు. హరీశ్‌రావు అరెస్టును నిరసిస్తూ సిద్దిపేటలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరీశ్‌రావును వెంటనే విడుదల చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ధర్నాలు, ర్యాలీలతో నిరసన వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ రాజ్యమా…? ఎమర్జెన్సీ పాలనా? : హరీశ్‌రావు
” ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారు. ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, నా పై, బి ఆర్ ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారు. అక్రమ అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కి తరలిస్తున్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నావు. రేవంత్ రెడ్డీ.. నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్ళం కాదు. తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెబుతుంది”… అని హరీశ్‌రావు ఎక్స్(X) లో పోస్టు చేశారు.
………………………………………..