* 121 నియోజకవర్గాల్లో.. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్
* ఉదయం 9 గంటలకు 13.13 శాతంగా నమోదు
ఆకేరు న్యూస్, డెస్క్ : బిహార్‌లో పోలీంగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్రంలోని 18 జిల్లాల పరిధిలోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 1,314 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచారు. రాష్ట్రంలోని 3.75 కోట్ల మంది ఓటు వేయనున్నారు. ఉదయం 9 గంటల వరకు13.13% శాతం పోలింగ్ నమోదైంది. మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు స్వచ్ఛంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని యాదవ్ కోరారు.
45,341 పోలింగ్ కేంద్రాలు.. 3,75,13,302 మంది ఓటర్లు..
మొత్తం 3,75,13,302 మంది ఓటర్లలో 1,98,35,325 మంది పురుషులు, 1,76,77,219 మంది మహిళలు, 758 మంది థర్డ్ జెండర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం మొత్తం 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 36,733 గ్రామీణ ప్రాంతాల్లో, 8,608 పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. పోలింగ్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం కల్పించారు. వీటితో పాటు 320 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 926 మహిళా నిర్వాహక కేంద్రాలు, 107 దివ్యాంగుల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాధారణ నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని 6 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఓటర్లు అధికారులకు సహకరించాలని కోరారు. ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.
………………………………………………
