|* రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : దీక్షా దివస్ చేపట్టి నేటికి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో పలు నగరాల్లో బీఆర్ ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. 2009 నవంబర్ 29 న కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకొన్న విషయం తెల్సిందే.. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టారు. కేసీఆర్ ఆమరన దీక్ష చేపట్టడంతోనే తెలంగాణ ఉద్యమం మరింత ఊపందుకొంది. ఉద్యమ తాకిడిని తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ఱాన్ని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా చరిత్ర అయితే కేసీఆర్ చేపట్టిన దీక్షకు 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేటలో నిర్వహించిన బైక్ ర్యాలీలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. సిద్దిపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం హరీష్ రావు కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి పాల్గొన్నారు. ఖమ్మంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, చంద్రావతి పాల్గొన్నారు. దీక్షా దివస్ సందర్భంగా సంగారెడ్డిలో అమరవీరులకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, రాష్ట్ర నాయకులు దేవీప్రసాద్ ఇతర బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు.హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు.
