Bollaram Child Murder Case
* వాచ్‌మెన్‌గా తొలగించారనే కక్ష
* నిందితుడి కోసం పోలీసుల గాలింపు
ఆకేరు న్యూస్, మేడ్చల్ : బొల్లారంలో చిన్నారి మోసెస్ అరేలియా హ*త్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రవర్తన సరిగా లేదనే కారణంతో వాచ్మెన్ విక్రమ్‌ను కాలనీ సంఘం అధ్యక్షులు వారం రోజుల క్రితమే ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ కక్షతోనే రగిలిపోయిన విక్రమ్ ఆ చిన్నారిని కిడ్నాప్ చేయడానికి పక్కా పథకం వేశాడు.
క్లబ్‌హౌస్ పరిసరాల్లో చిన్నారి కోసం తాత ఆందోళనగా వెతుకుతున్న తరుణంలోనే, బాలికను బయటకు తీసుకెళ్లడం విక్రమ్‌కు సాధ్యపడలేదు. అటు పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడంతో భయపడిపోయిన నిందితుడు ఆ చిన్నారిని దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని నీటి సంపులో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
చిన్నారి మృతదేహానికి గాంధీలో పోస్టుమార్టం
ఈ దారుణ ఘటనపై పోలీసులు వెంటనే అప్రమత్తమై విస్తృత దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు విక్రమ్ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు జల్లెడపడుతున్నారు. ఈ ఘటనతో తీవ్ర అప్రమత్తమైన కాలనీ వాసులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, గతంలో ఉన్న సెక్యూరిటీ ఏజెన్సీని మార్చివేశారు.
నిఘా పెంచాలని డిమాండ్
ఇలాంటి అభంశుభం తెలియని చిన్నారి ప్రాణాలు బలిగొన్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రెసిడెన్షియల్ కాలనీల్లో భద్రతా ప్రమాణాలు, సెక్యూరిటీ సిబ్బంది నియామకంపై మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.
పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

