
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఇటీవల వరుసగా విమానాల్లో బాంబు ఉందంటూ ఫోన్లు, సోషల్ మీడియా పోస్టుల్లో పేర్కొనడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. తాజాగా దేశీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు దాదాపు 30కిపైగా బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం రాత్రి నుంచి 30కిపై బెదిరింపులు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. బెదిరింపుల నేపథ్యంలో జెడ్డాకు వెళ్లాల్సిన మూడు ఇండిగో విమానాలను సౌదీ అరేబియా, ఖతార్ విమానాశ్రయాలకు మళ్లించారు. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. గతవారం రోజుల్లో భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న 120కిపైగా విమానాలకు బెదిరింపులు వచ్చాయి.
పది ఇండిగో విమానాలకు హెచ్చరికలు అందినట్లు ఎయిర్‌లైన్ ప్రతినిధి ఒకరు మంగళశారం తెలిపారు. బెంగళూరు – జెడ్డా విమానం దోహాకు, కోజికోడ్ – జెడ్డా విమానం రియాద్, ఢిల్లీ – జెడ్డా విమానం మదీనాకు మళ్లించారు. ఈ మూడు విమానాలను మిడిల్ ఈస్ట్ దేశాలకు మళ్లించారు. వీటితో పాటు ఢిల్లీ- దమ్మాం, ఇస్తాంబుల్ – ముంబయి, ఇస్తాంబుల్ – ఢిల్లీ, మంగళూరు – ముంబయి, అహ్మదాబాద్ – జెడ్డా, హైదరాబాద్ – జెడ్డా, లక్నో నుంచి పుణే విమానాలకు బెదిరింపులు వచ్చాయని ప్రతినిధి పేర్కొన్నారు. బెదిరింపుల నేపథ్యంలో ప్రోటోకాల్ మేరకు సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. విస్తారా ప్రతినిధి మాట్లాడుతూ సోమవారం పలు విమానాలకు సోషల్ మీడియాలో భద్రతా బెదిరింపులు వచ్చాయని చెప్పారు. ఆయా బాంబు బెదిరింపుల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. వరుసగా బెదిరింపుల నేపథ్యంలో అటు ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారడంతో పాటు ఇటు వియానయాన సంస్థలకు సైతం పెద్ద తలనొప్పిగా మారింది. బెదిరింపులను తీవ్రంగా పరిగణించనున్నట్లు పౌర విమానయానశాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులను నో ఫ్లై జాబితాలో చేర్చనున్నారు. విమానాలను పేల్చివేస్తామని బెదిరించే వారిని కఠినంగా శిక్షించేలా ఎయిర్‌క్రాఫ్ట్ సెక్యూరిటీ రూల్స్‌లో మార్పులు చేసేందుకు సైతం యోచిస్తున్నారు.
………………………………………………..