* ఓట్లను బీజేపీకి బదిలీచేసింది
* బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిన స్థానాల్లోనే బీజేపీ గెలిచింది
* సిద్దిపేటలో హరీశ్‌ది ఆత్మహత్యా సదృశం కాదా..
* కాంగ్రెస్ కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయి
* అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓట్లు పెరిగాయి..
* కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ గెలిచాం..
* తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం, అవయవదానానికి పాల్పడ్డారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విమర్శించారు. బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి మళ్లించారన్నారు. బీజేపీ గెలిచిన 8 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 7 చోట్ల డిపాజిట్ కోల్పోయిందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై బుధవారం ఉదయం రేవంత్ మీడియాతో మాట్లాడారు. బలహీనమైన అభ్యర్థులను కేసీఆర్(KCR) ఎన్నికల్లో నిలబెట్టి బీజేపీ గెలుపునకు దోహదపడ్డారని, పార్టీశ్రేణులు బీజేపీకి పనిచేసేలా చేశారని ఆరోపించారు. అందుకే బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగాయన్నారు. బీఆర్ఎస్ ఓట్లు 30.5 శాతం నుంచి 16.5 శాతానికి పడిపోయాయని, బీఆర్ఎస్ కు ఎంతయితే తగ్గాయో, అంతే శాతం బీజేపీకి పెరిగాయని వెల్లడించారు. ఎన్నికల ఫలితాలను బీజేపీకి మార్చి కేసీఆర్ కుటుంబం ద్వంద్వనీతికి పాల్పడిందని, సమాజం, సెక్యూలర్ వాదులు ఈ అంశాన్ని గుర్తించాలని తెలిపారు.
అత్యంత కీలకమైన అంశం ఏంటంటే..
అత్యంత కీలకమైన అంశం ఏంటంటే.. 2001లో కేసీఆర్ టీడీపీకి రాజీనామా చేసి.. సిద్దిపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచీ, 2023 డిసెంబర్ వరకు బీఆర్ఎస్కు అత్యధిక మెజార్టీ వచ్చిన నియోజకవర్గం సిద్దిపేట అని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీశ్‌రావు తన పూర్తి ఓట్లను బీజేపీకి బదిలీ చేశారని తెలిపారు. అందుకే ఈ ఎన్నికల్లో సిద్దిపేటలో బీఆర్ఎస్ కు వచ్చిన మెజార్టీ 2500 మాత్రమే అన్నారు. సిద్దిపేటలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శంచే హరీశ్‌రావు, కేసీఆర్.. మెదక్ లో బీజేపీని గెలిపించి.. బడుగు, బలహీనవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించారని వివరించారు. సిద్దిపేటలో వచ్చిన మెజార్టీ వల్లే కాంగ్రెస్ సీటు కోల్పోయిందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని నమ్మించి మోసం చేయడమే కాకుండా.. కాంగ్రెస్ ను ఓడించేందుకు ఆత్మబలిదానం చేసుకున్నారని విమర్శించారు.
పార్లమెంట్ లో బీఆర్ ఎస్ ప్రాతినిధ్యం జీరో
పార్టీ పెట్టిన తర్వాత.. పార్లమెంట్ లో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారని రేవంత్ తెలిపారు. ప్రభుత్వాన్ని అస్తిరపరచాలనే ఆలోచనలతో కుట్రలకు పాల్పడితే ప్రజలు పూర్తిగా బీఆర్ఎస్ ను మట్టికరిపించారని అన్నారు. చివరకు తెలంగాణ ఉత్సవాల్లో కూడా పాల్గొనకుండా చిల్లరమల్లర కారణాలు చూపడం ప్రజలు గమనించారన్నారు. ఇప్పటికైనా వ్యవహార శైలి మార్చుకుని ప్రతిపక్షంగా సలహాలు సూచనలు ఇవ్వాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. మీ కుటుంబం కోసమో, ఆస్తుల కోసమో మీరు పనిచేస్తే.. ప్రజలు గమనించి బుద్ధిచెబుతారని వెల్లడించారు.
వంద రోజుల పాలనను గుర్తించారు..
ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయని రేవంత్ వివరించారు. ఈ ఎన్నికలు తమ 100 రోజుల పాలనకు రెఫరెండం అని, వంద రోజుల పాలన తర్వాత 41 శాతం ఓట్లు వచ్చాయన్నారు. అసెంబ్లీ కంటే ఓట్లు పెరిగాయని తెలిపారు. గెలిచిన సీట్లలో అత్యధిక మెజార్టీ అందించారని తెలిపారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ గెలిచామన్నారు. మరోవైపు కేంద్రంలోనూ కాంగ్రెస్ బలపడిందన్నారు. ఎన్డీఏకు ఇండియానే ప్రత్యామ్నాయమన్నారు. మోదీ ప్రజావ్యతిరేక విధానాలను రాహుల్ ప్రజలకు వివరించారని, జోడోయాత్రతో దేశంలో పరిస్థితి మారిందని తెలిపారు. కాంగ్రెస్‌కు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
—————–