
* బీసీ బిల్లును కావాలనే అడ్డుకుంటున్నారు
*తప్పుచేయకుంటే భయమెందుకు
* శాసనమండలిలో మంత్రి పొన్నం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ ఫ్యూడలిస్టిక్ పార్టీ అని అందుకే బీసీ రిజర్వేషన్ బిల్లును అడ్డకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (PONNAM PRABHAKAR) ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్ బిల్లు శాసనమండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో మంత్రులు పొన్నం,సీతక్క పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతుండగా బీఆర్ ఎస్ సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. కాళేశ్వరం రిపోర్టు ప్రతులను చింపి వేసి స్పీకర్ పోడియంపై విసిరేశారు. సభ్యులు మాట్లాడకుండా అడ్డు పడ్డారు.
మంత్రి పొన్నం తీవ్ర అభ్యంతరం
శాసన మండలిలో బీసీ రిజర్వేషన్లపై చర్చ జరుగుతుండగా బీఆర్ ఎస్ సభ్యులు ఆందోళన చేయడాన్ని మంత్రి పొన్నం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ పార్టీకి బీసీలకు న్యాయం చేసే ఉద్దేశ్యం లేదని మండి పడ్డారు. భూర్జువా భావాలున్న బీ ఆర్ ఎస్ పార్టీ కావాలనే బిల్లుపై అడ్డు తగులోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సీబిఐకి అప్పగించడం సమంజసమే అని మంత్రి పొన్నం అన్నారు, తప్పు చేయకుంటే భయమెందుకు అని బీఆర్ ఎస్ సభ్యులను మంత్రి ప్రశ్నించారు. ఇదిలా ఉండగా రాష్ట్రానికి మేలు చేసిన కేసీఆర్ పై సీబీఐ విచారణ జరిపిస్తారా అంటూ బీఆర్ ఎస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చూస్తూ సభలో ఎవరూ మాట్లాడకుండా గందర గోళం సృష్టించారు. సభ్యుల హోరా హోరీ ఆందోళనల మద్య శాసన మండలి బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేశారు
గన్ పార్క్ వద్ద నిరసన
శాసన మండలి నిరవధికంగా వాయిదాపడిన తరువాత బీఆర్ ఎస్ ఎమ్మెల్సీలు నల్లుకండువా కప్పుకొని గన్ పార్క్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. గన్ పార్క్ వద్ద బైఠాయంచి నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణను సీబీఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేశారు.
……………………………………………..