
* అసెంబ్లీ ఎన్నికల అనంతరం మసకబారుతున్న ప్రతిష్ఠ
* మరోవైపు కేసులు, అరెస్టులతో కీలక నేతల ఉక్కిరిబిక్కిరి
* క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కి.. పట్టు సాధించాలని గులాబీ నేతల వ్యూహాలు
* సాగునీటి ప్రాజెక్టులే ఆయుధంగా మరో ఉద్యమానికి సమాయత్తం
* వాటి చుట్టూనే నేతల మాటల తూటాలు
* తెలంగాణకు అన్యాయం అంటూ వెలుగెత్తి చాటే యత్నం
* రాజకీయ పునరుజ్జీవనానికి బాటలు
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి :
నీళ్లు.. నిధులు.. నియామకాలు.. వీటి కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పురుడుపోసుకుంది. ఆ నినాదంతోనే నాడు తెలంగాణ రాష్ట్ర సమితి పోరాడింది. ప్రజల్లో ఉద్యమ కాంక్షను రగిలించింది. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు.. నిధులు.. నియామకాల విషయంలో తెలంగాణ కు అన్యాయం జరుగుతోందని ఉద్యమ సారథిగా నాడు కేసీఆర్ పిడికిలి బిగించి పోరాడారు. రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల మన్ననలను పొందారు. స్వరాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో కొనసాగారు. అయితే మూడో సారి ప్రజలు కేసీఆర్ కు సారీ చెప్పారు. కాంగ్రెస్ కు పట్టం కట్టారు. అధికారం కోల్పోయిన నాటి నుంచీ బీఆర్ ఎస్ (టీఆర్ ఎస్) ఖ్యాతి మసకబారుతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీంతో పార్టీలోని ముఖ్యనేతలు సైతం పక్క చూపులు చూడడం మొదలుపెట్టారు. ఫలితంగా పార్టీని కాపాడుకోవడానికి అధినాయకులైన కేసీఆర్, కేటీఆర్ అపసోపాలు పడాల్సి వచ్చింది. ఈక్రమంలో ఏ నినాదంతో అయితే రాష్ట్రాన్ని సాధించి, అధికారం పొందారో.. ఇప్పుడు అదే నినాదాన్ని మరోసారి ప్రయోగించి పునరుజ్జీవనానికి బీఆర్ ఎస్ ప్రయత్నం చేస్తోంది.
కవిత నిరసన గళం.. బీజేపీ లో విలీనం..
అసెంబ్లీ ఎన్నికల అనంతరం మసకబారిన బీఆర్ ఎస్ ప్రతిష్ఠ.. కవిత నిరసన గళంతో మరింత చిచ్చు రేపింది. ఆమె కేసీఆర్ కు రాసిన లేఖ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి గందరగోళం ఏర్పడింది. పరోక్షంగా కేటీఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేయడం, బీజేపీలో బీఆర్ ఎస్ విలీనానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు రావడం.. పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. బీఆర్ ఎస్ లో చీలిక ఖాయమనే సంకేతాలు వెళ్లాయి. ఈ పరిణామాలన్నీ బీఆర్ ఎస్ బాస్‌లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కార్యకర్తలను కూడా అయోమయంలో పడేస్తున్నాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్, ఈ కార్ రేస్ కేసు గులాబీ బాస్‌లను కలవర పెడుతున్నాయి. దీనికితోడు కీలక నేతల అరెస్టులు, వారిపై కేసులతో సర్కారు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈక్రమంలో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన వార్తలతో బీఆర్ ఎస్ తన ఉద్యమ పంథాను కొనసాగించేందుకు సిద్దం అవుతోంది.
“బనకచర్ల”తో పెరిగిన వాయిస్
నిధులు, నదులు ఆంధ్రాకే కట్టబెడతారా? అంటూ బీఆర్ ఎస్ నేతలు మళ్లీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం బనకచర్ల ప్రాజెక్టుకు 50 శాతం నిధులను గ్రాంట్ల రూపంలో ఇస్తూ, మిగిలిన నిధులను ఎఫ్ ఆర్ బీఎం పరిమితుల మినహాయింపు ద్వారా సేకరించడానికి అనుమతిస్తోందని, తెలంగాణకు కాళేశ్వరం, సీతారామ, పాలమూరు వంటి ప్రాజెక్టులకు ఇలాంటి సహాయం ఇవ్వడం లేదని ఆ పార్టీ నేతలు గొంతెత్తుతున్నారు. బనకచర్ల ద్వారా.. తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి ఫణంగా పెడుతున్నారని హరీశ్ రావు పలుమార్లు విమర్శించారు. ‘‘నిధులు, నదులు ఏపీకి ఇస్తున్నది. తెలంగాణకు మాత్రం మూట సాయం లేదు.. మాటసాయమూ లేదు. కృష్ణా జలాల్లో దోపిడీకి పోతిరెడ్డిపాడును ఏపీ వాడుకుంటున్నట్టుగా.. గోదావరి జలాల దోపిడీకి బనకచర్ల ప్రాజెక్టును వాడుకుంటుంది” అని అన్నారు.
మళ్లీ ఉద్యమమే
గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ అంశాన్నే ప్రధానంగా తీసుకుని మరో ఉద్యమానికి బీఆర్ ఎస్ సమాయత్తం అవుతోంది. కాంగ్రెస్ మౌనం – తెలంగాణకు శాపం అంటూ ప్రచారం హోరెత్తిస్తోంది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ నిర్లక్ష్యం చూపుతోందని ప్రకటిస్తోంది. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంపై చర్చించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో త్వరలోనే కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నది. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు హాజరయ్యే ఈ ఉన్నతస్థాయి సమావేశంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అలసత్వం, రైతు వ్యతిరేక వైఖరిపై ప్రధానంగా చర్చించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనబెట్టడంతో పాటు 2 పిల్లర్లు కుంగాయన్న సాకుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. నాడు నీళ్లు-నిధులు-నియామకాల పేరుతో పోరాడిన పార్టీ.. మరోసారి నీటి వాటాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఉద్యమానికి సిద్ధమవుతోంది.
———————————-