Telangana Assembly
* రంగనాయక్ సాగర్‌లో ₹5.33 కోట్ల రోడ్డు..
* 1,389 ఎకరాల అటవీ భూమిపై ఆరోపణలు
Telangana Assembly: ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపిస్తున్న భూకబ్జాలు, అధికార దుర్వినియోగానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన భూముల వ్యవహారాలను సర్వే నంబర్లతో సహా సభ దృష్టికి తీసుకువచ్చారు.
రంగనాయక్ సాగర్‌లో హరీష్ వ్యవహారం
రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ భూసేకరణలో హరీష్ రావు తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని సీఎం ఆరోపించారు. తొలుత భూసేకరణ పరిధిలో ఉన్న కొన్ని భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి, అనంతరం వాటిని నోటిఫికేషన్ నుంచి మినహాయించుకున్నారని పేర్కొన్నారు. అదే ప్రాంతంలోని ఇతర రైతుల భూములను మాత్రం ప్రభుత్వం సేకరించిందని తెలిపారు.
హరీష్ రావు ఫామ్‌హౌస్‌కు రోడ్డు నిర్మాణం కోసం సిద్దిపేట మున్సిపల్ నిధుల నుంచి ₹5.33 కోట్లు ఖర్చు చేశారని సీఎం ఆరోపించారు. టెండర్లు లేకుండానే నిధులు మళ్లించారని పేర్కొన్నారు. అలాగే రిజర్వాయర్ కోసం సేకరించిన సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని సుడాకు బదిలీ చేసి, ఫామ్‌హౌస్‌కు అనుకూలంగా వినియోగించారని ఆరోపించారు.
1,389 ఎకరాల అటవీ భూమిపై ఆరోపణలు
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నెమలిపురి గ్రామంలోని సర్వే నంబర్ 318/A/1లో 1,389.36 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ధరణి ద్వారా పట్టా భూమిగా మార్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేరిట బదిలీ చేయడంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని పేర్కొన్నారు.
శంషాబాద్‌లో 650 ఎకరాలు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలోని సర్వే నంబర్లు 28, 62లో సుమారు 650 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని సీఎం ఆరోపించారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సుధీర్ రెడ్డిల పేర్లను సభలో ప్రస్తావించారు. అలాగే షాబాద్ మద్దూరులో 11.5 ఎకరాల ఇనాం, అసైన్డ్ భూములు, మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని అసైన్డ్ భూమి, కందుకూరు తిమ్మాపూర్‌లో 77 ఎకరాల భూదాన్ భూముల వ్యవహారాలను కూడా సీఎం సభలో ప్రస్తావించారు.
విచారణకు ఆదేశాలు
భూకబ్జాలు, అటవీ, అసైన్డ్, భూదాన్ భూముల వ్యవహారాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సీఐడీతో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత వ్యక్తులు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
