కేటీఆర్‌పై కవిత ఆగ్రహం..
కొత్త పార్టీ దిశగా అడుగులు?
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేగింది. గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్న బిఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన స్వంత పార్టీపైనే ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
మౌనం వీడిన కవిత: కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందని జరుగుతున్న ప్రచారాన్ని కవిత తీవ్రంగా ఖండించారు. పార్టీ ఓటమిని తనపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన సోదరుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ట్వీట్లను ప్రస్తావిస్తూ, ఓటమికి లిక్కర్ కేసే కారణమని ప్రచారం చేయడంపై ఆమె మండిపడ్డారు. “నేను పార్టీ కోసమే కదా ఇవన్నీ ఎదుర్కొంది? తప్పు తేలకముందే నా వ్యక్తిత్వ హననం చేస్తుంటే పార్టీ ఎందుకు మౌనంగా ఉంది?” అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. ఏడాది కాలంగా తాను అనుభవిస్తున్న మానసిక క్షోభకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆమె నిలదీశారు.
కొత్త పార్టీ దిశగా.. కవిత!!
అయితే ఈ వివాదంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కవిత తన రాజకీయ భవిష్యత్తుపై చేసిన ప్రకటన. రాబోయే రెండు నెలల్లో తాను కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా, ప్రస్తుతం ఉన్న బిఆర్ఎస్ మరియు బీజేపీలు రెండూ ఒకటేనని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలతో కవిత రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కేవలం కుటుంబ సభ్యుల మధ్యే కాకుండా, పార్టీ అగ్ర నాయకత్వం మధ్య పొడసూపిన ఈ విభేదాలు తెలంగాణ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. కవిత కొత్త పార్టీ ప్రకటన కేవలం హెచ్చరికా? లేక నిజంగానే ఆమె సొంత కుంపటి పెట్టుకోబోతున్నారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
