BRS Mushirabad Protest
* ముషీరాబాద్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ
* రోడ్డు గుంతలకు కొబ్బరికాయలు
అకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా సాగింది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెయ్యి రోజుల పాలనలో ఏ వర్గానికీ మేలు చేసే కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు.
* ఆటో నడిపిన ఎమ్మెల్యే
ప్రభుత్వ మోసపూరిత వైఖరిని నిరసిస్తూ స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్ స్వయంగా ఆటో నడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. ఆటో డ్రైవర్లకు ప్రతినెల 12 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్న ఎన్నికల హామీ ఏమైందని ఆయన నిలదీశారు. సరైన ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. తక్షణమే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి
ఎన్నికల సమయంలో వంద రోజుల్లోనే అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని నమ్మబలికి, నేడు వెయ్యి రోజులు గడిచినా ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చలేదని బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహా విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, నాలుగు వందలకు పైగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ప్రజలు త్వరలోనే కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.
* గుంతలకు కొబ్బరికాయలు
కేవలం హామీల వైఫల్యమే కాకుండా, స్థానిక సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఎత్తిచూపుతూ.. భారీ బ్యానర్‌తో రోడ్లపై ఉన్న గుంతలను టేపులతో కొలిచారు. అనంతరం ప్రభుత్వానికి సద్బుద్ధి కలగాలంటూ రోడ్డు గుంతలకే కొబ్బరికాయలు కొట్టి తమ నిరసనను వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో తలారి శ్రీకాంత్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ వి. శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
