Congress KCR Farmhouse Criticism
* ఫాంహౌస్‌కే పరిమితం
* తక్షణమే రాజీనామా చేయాలి: కాంగ్రెస్ శ్రేణుల ధ్వజం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి సంస్కరణల కారణంగా రాబోయే 2040 సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అంటే కుంభకర్ణ చంద్రశేఖరరావు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
* బీఆర్ ఎస్ కు వేర్లు దెబ్బతిన్నాయి : మహేష్‌కుమార్‌గౌడ్
రాష్ట్రంలో బీజేపీకి ఎలాంటి ఉనికి లేదని, బీఆర్ఎస్ పార్టీ వేర్లు దెబ్బతిని కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుందని మహేష్‌కుమార్‌గౌడ్ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదా అనేది ఎంతో బాధ్యతతో కూడుకున్నదన్న ఆయన, కేసీఆర్ మాత్రం ఆ పదవికి పూర్తిగా వన్నె తెచ్చారని విమర్శించారు. వెయ్యి రోజులుగా అసెంబ్లీ ముఖం చూడకుండా, ప్రజాధనంతో జీతాలు తీసుకుంటూ కేవలం ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్.. తక్షణమే తన ప్రతిపక్ష నాయకత్వ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్ల కాలంలో లక్షా 78 వేల కోట్ల విదేశీ పెట్టుబడులతో పాటు గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని స్పష్టం చేశారు. దేశంలోనే కుల సర్వేలో తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచిందని కొనియాడారు.
* ప్రభుత్వాలపై విషప్రచారం: మంత్రి శ్రీధర్‌బాబు
పదేళ్ల బీఆర్ఎస్ అరాచక పాలనలో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే 2023లో ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. డిసెంబర్ 7, 2023 నుంచి అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల కుటుంబాలు కూడా వాడుకుంటూ, సోషల్ మీడియాలో మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీచమైన విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ప్రజలు వారిని మరో పదేళ్లు రోడ్డుపైనే కూర్చోబెడతారని తీవ్రంగా హెచ్చరించారు.
* కేసీఆర్‌కు భయం ఎందుకు?: మంత్రులు, ఎంపీల నిరసన
మంత్రి పొన్నం ప్రభాకర్: ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను ఎలాంటి అవరోధాలు లేకుండా విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజాధనాన్ని వృథా చేస్తూ వెయ్యి రోజులుగా అసెంబ్లీకి రాకుండా ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌కు సభకు రావడానికి భయమేంటని మంత్రి అజారుద్దీన్ ప్రశ్నించారు. కేసీఆర్ తన పాలనలో తెలంగాణను సింగపూర్‌లా మారుస్తానని చెప్పి కేవలం దోచుకున్నారే తప్ప ఏమీ చేయలేదని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ సభకు హాజరుకాని కేసీఆర్‌కు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని ఎంపీ మల్లురవి స్పష్టం చేశారు.
* కేటీఆర్‌పై ఆగ్రహం
రాహుల్‌గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదని, సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ చొరవతోనే తెలంగాణ ఏర్పడిందని, మీ తండ్రి సీఎం పదవిని చేపట్టారనే చారిత్రక సత్యాన్ని మరువవద్దని కాంగ్రెస్ నేతలు హితవు పలికారు. కాంగ్రెస్‌ను టచ్ చేయడం ఎవరి తరం కాదని, అమరులను, ఉద్యమకారులను విస్మరించిన బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే త్వరలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు వి.హనుమంతరావు, ఎంపీలు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
