* నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
* రైతుల సమస్యలపై ధర్నాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్.. ప్రతిపక్షనాయకుడిగా ప్రజాసమస్యలపై మళ్లీ ఉద్యమాలకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. కొంతకాలం స్తబ్దుగా ఉన్న గులాబీ బాస్ మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ప్రతిపక్ష పార్టీ ఉద్యమ పంథా వైపు అడుగులు వేస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో ఓ సందర్భంగా మాట్లాడుతూ.. మళ్లీ ఉద్యమకాలం నాటి కేసీఆర్ను చూస్తారని ప్రకటించారు. ఇప్పుడు పోలింగ్ ముగిసిన వెంటనే రైతాంగ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా.. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వ్యవసాయానికి కరెంటు, నీళ్లు ఇవ్వకుండా ఏడిపించిన ప్రభుత్వం ఇప్పుడు పండించిన వడ్లు కొనకుండా రైతన్నలను ఇబ్బందులు పెడుతోందని ఆరోపిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఓట్లు డబ్బాలో పడంగానే..
రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులపై ధర్నా చేపట్టారు. వడ్లకు రూ.500ల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా నిర్ణయించడమేంటని కేసీఆర్ ప్రశ్నించారు. ఓట్లు డబ్బాలో పడగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని అందుకే నాలిక తిప్పేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ఎప్పటి మాదిరిగానే నయ వంచనకు పూనుకున్నారని మండిపడ్డారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తాం అన్న మాట ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే ఆ పార్టీని రైతులు తుక్కుతుక్కు చేసేవారని తెలిపారు. హక్కులను సాధించేందుకు బీఆర్ఎస్ ఎల్లప్పుడు వారి పక్షాన కొట్లాడుతుందని చెప్పారు. రైతులకు భరోసా కల్పించేందుకు నిరసనలతో పాటు ప్రతిరోజూ వడ్ల కల్లాల వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లి వారికి అండగా నిలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.
రోడ్లపై ధర్నాలు
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల కల్లాలు, మిల్లులు వద్ద ఉన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ బీఆర్ ఎస్ శ్రేణులు రోడ్లపై ధర్నాలు చేశారు., కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలోని రైతులు గత ఐదు రోజుల నుంచి గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని నిరసనకు దిగారు. 40 లారీలకు పైగా ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉందని, వడ్లను ఎఫ్సీఐ కేంద్రాలకు తరలించి 25 రోజులు అవుతున్న ఎలాంటి తూకం జరగడం లేదన్నారు. ఈ క్రమంలో రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు నిర్మల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని రైతులు కూడా రోడ్లపైకి వచ్చి తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మిల్లుల వద్ద ఉంచిన ధాన్యం అకాల వర్షానికి తడిచిపోయిందని లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో భువనగిరి జిల్లా రైలులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
————-