* ప్రమాద బాధితులకు సకాలంలో సాయం చేయాలి
* బ్లాక్స్పాట్లను గుర్తించి స్పీడ్గన్లు ఏర్పాటు చేస్తాం
* కలెక్టర్ రాహుల్ శర్మ
ఆకేరున్యూస్, భూపాలపల్లి: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రమాదాలను నివారించి ప్రమాదాల బారిన పడిన వారికి సకాలంలో సహాయం చేసి ప్రాణదానం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరివ్ అలైవ్ ఛాంపియన్ – 2026” కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మీడియా అవుట్రీచ్ డే కార్యక్రమాన్ని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాలో నిర్వహించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగు ప్రదేశాల్లో బ్లాక్ స్పాట్లను గుర్తించామని రోడ్లపై అతివేగంగా వెళ్లే వాళ్లకు స్పీడ్ గన్ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అంతిమంగా ముఖ్యంగా హెల్మెట్ ధరించి మాత్రమే వాహనాలు నడపాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్ మాట్లాడుతూ దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, అందులో దాదాపు 50 వేల మంది సకాలంలో వైద్య సహాయం అందకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాల మేరకు జనవరి మాసం మొత్తం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సూచనలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామని, ఇది 13 జనవరి 2026 నుండి 24 జనవరి 2026 వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించకపోవడం వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రమాద స్థలంలో ఉన్న పాదచారులు లేదా వాహనదారులు, పోలీసులు ప్రశ్నిస్తారు, కోర్టులకు పిలుస్తారు అనే భయంతో సహాయం చేయడం లేదని పేర్కొన్నారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టం – సెక్షన్ 134 ద్వారా గుడ్ సమరిటన్లకు పూర్తి రక్షణ కల్పించిందని, ప్రమాద బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారి వివరాలను పోలీసులు అడగరాదని, కోర్టులకు హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గోల్డెన్ అవర్లో స్వచ్ఛందంగా రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి “గుడ్ సమరిటన” బిరుదుతో పాటు రూ.25,000 నగదు బహుమతి అందజేస్తారని తెలిపారు. ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో గరిష్టంగా ఐదు సార్లు ఈ బహుమతిని పొందవచ్చని అన్నారు. అలాగే రాష్ట్రస్థాయిలో ఎంపికైన గుడ్ సమరిటన్లలో నుంచి మూడు పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయగా, ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.1 లక్ష నగదు బహుమతి జాతీయ అవార్డు అందజేస్తుందని తెలిపారు. ఈ అవగాహన సదస్సుల్లో వివిధ శాఖల అధికారులతో పాటు లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, బొగ్గు లారీ డ్రైవర్లు పాల్గొన్నారు.
…………………………….
