* మరోవైపు ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు
* ఇప్పటికే కేసీఆర్ లేఖతో పెరిగిన రాజకీయ వేడి
* కేసీఆర్ తో అంత ఈజీ కాదంటున్న నిపుణులు
ఆకేరు న్యూస్, బర్నింగ్ స్టోరీ :
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ విచారణకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. కేసీఆర్ అంటే ఆషామాషీ వ్యక్తి కాదు. ఆయనను కదిలే ఎన్ సైక్లోపిడియాగా కొందరు అభివర్ణిస్తారు. వందల పుస్తకాలు చదివిన సాహిత్య పిపాసిగా మరికొందరు అంటారు. రాజకీయాలతో చెడుగుడు ఆడుకోవడం అందరూ చూసే ఉంటారు. మాటల తూటాలు పేల్చడంలో ఆయనకు ఆయనే సాటి. కౌంటర్లు ఎన్ కౌంటర్లు ఇవ్వడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా అనే పేరూ ఉంది. అలాంటి కేసీఆర్ ను నేడు సిట్ ప్రశ్నించనుంది. అంటే చాలా పకడ్బందీగా ప్రశ్నల జాబితా రూపొందించే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాధాకిషన్ రావు ఇచ్చిన కన్ఫేషన్ స్టేట్ మెంట్, ప్రభాకర్ రావు, భుజంగరావు వాంగ్మూలాల ఆధారంగా సిట్ అధికారులు ప్రశ్నావళి తయారుచేసినట్లు తెలుస్తోంది.
ఎర్రవల్లిలో కాదని..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు సిట్ అధికారులు చాలా మందిని విచారించారు. రాజకీయ ప్రముఖులను కూడా ఇప్పటికే విచారణ జరిపింది. మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు ను అధికారులు విచారించారు. అలాగే.. ఈ కేసులో మొత్తం దాదాపు 618 మంది స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రావును సైతం పలుమార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఇప్పుడు తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసు ఎపిసోడే హాట్ టాపిక్ గా మారింది. సంవత్సరాలుగా ఉంటున్న ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ లోనే విచారణ జరపాలని కేసీఆర్ కోరినా అధికారులు తోసిపుచ్చారు. అంతేకాదు.. నోటీసులు కేసీఆర్ కు నేరుగా ఇవ్వకుండా, నందినగర్ లోని నివాసానికి అంటించి వెళ్లిపోయారు. ఇది కేసీఆర్ కు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది.
తనదైన శైలిలో స్పందించిన గులాబీ బాస్
సిట్ నోటీసులపై స్పందించిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. చట్టంపై గౌరవంతో విచారణకు హాజరవుతానని చెబుతూనే.. నోటీసులు ఇచ్చిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు.. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి లేఖ కూడా రాశారు. సిట్ అధికారులు వ్యవహరించిన తీరు చట్టాలకి వ్యతిరేకమని, సుప్రీంకోర్టు తీర్పులను తుంగలో తొక్కారని పేర్కొన్నారు. సిట్ అధికారులకి నోటీసు ఇచ్చే అధికారమే లేదు. ఇది నా రాజ్యాంగ హక్కులను కాలరాయడమేని అన్నారు. ‘తదుపరి నోటీసులన్నీ కూడా ఎర్రవల్లిలోని నా నివాసానికే పంపాలని చెప్పాను. కానీ, ఇది చెప్పిన తర్వాత కూడా గుర్తుతెలియని వ్యక్తులు మీ సంతకంతో ఉన్న లేఖను రాత్రి 9 గంటలకు నందినగర్ నివాసంలోని మా ఇంటి గోడకు అతికించినట్లు తెలుస్తోంది. ఆ లేఖ మీరే పంపినట్లయితే, మీ సూచనల మేరకే అతికించినట్లయితే, ఆ లేఖను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను.’ అని కేసీఆర్ లేఖలో ప్రస్తావించారు.
నేడు బీఆర్ ఎస్ ఆందోళనలు
అలాగే.. ‘చట్టపరమైన అంశాలు ఎలా ఉన్నప్పటికీ, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యతాయుతమైన భారత పౌరుడిగా దర్యాప్తుకు సహకరించాలని నిర్ణయించుకున్నాను. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లో అందుబాటులో ఉంటా. మీరు నందినగర్ నివాసంలోనే స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని పట్టుబట్టినందున అక్కడే అందుబాటులో ఉంటా’ అని కేసీఆర్ లేఖ ద్వారా తెలియజేసి తన ప్రత్యేకతను చాటారు. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ గతంలో సుప్రీంకోర్టు ‘సతేంద్ర కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ’ అనే కేసులో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు. ఈ లేఖ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ తో అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ లేఖ అనంతరం.. బీఆర్ ఎస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది.
కేసీఆర్ విచారణ.. కట్టుదిట్టమైన భద్రత
కాంగ్రెస్ వేధింపు రాజకీయాలకు నిరసనగా ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త శాంతియుత ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రధానంగా హైదరాబాద్ లో ఈ ఆందోళనలను ఉధృతంగా చేపట్టేందుకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్ణయించారు. ఒక్కడిగా రాష్ట్ర సాధనకు బయలు దేరి అందర్నీ ఏక తాటిపైకి తెచ్చి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్‌పై కాంగ్రెస్ కక్ష సాధింపులను ప్రపంచమంతా చూస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కేసీఆర్ ఎక్కడ ఉంటారో అందరికీ తెలుసునని, రాష్ట్ర మంత్రులు కూడా అక్కడికి వెళ్లి మేడారం జాతరకు ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. సిట్ అధికారులు మాత్రం నంది నగర్ నివాసానికి వచ్చి గోడకు నోటిసు అతికించి కించపరిచారని తెలిపారు. సిట్ విచారణపై కేసీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే విచారణ పై స్టే వచ్చేదని అలా కాకుండా చట్టాన్ని గౌరవించి విచారణకు హాజరవుతున్నారని వెల్లడించారు. నేడు రాజధాని హైదరాబాద్‌లో ఆందోళనలకు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈక్రమంలో నేడు హైదరాబాద్ నగరంలో వాతావరణం వేడెక్కే అవకాశం ఉందని పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది.
……………………………………..
