Nemaramji
* మార్వాడీల ఆందోళన
Medchal| మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఓ వ్యాపారి నగరశివారులోని నిర్మానుష్య ప్రాంతంలో శవమై కనిపించారు. ఈ మృతికి పోలీసుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమంటూ కుటుంబ సభ్యులు, మార్వాడీ సంఘం ప్రతినిధులు సోమవారం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు పెద్దఎత్తున నిరసన తెలిపారు.
స్థానికులు.. పోలీసుల కథనం ప్రకారం..
రాజస్థాన్లోని పాలి జిల్లా మండ గ్రామానికి చెందిన నేమారామ్జీ (55) కుటుంబంతో కలిసి బోయిన్పల్లిలోని హస్మత్పేట్లో నివసించేవారు. ఎల్బీనగర్లో లైట్ల వ్యాపారంతో పాటు చిట్టీలు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఏడు నెలల క్రితం గుండ్లపోచంపల్లిలో స్థిరపడి, అక్కడే హార్డ్వేర్ షాపు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారులిద్దరూ బోయిన్పల్లిలోనే ఉంటున్నారు. ఈ నెల 2వ తేదీ ఉదయం గుండ్లపోచంపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై బోయిన్పల్లిలోని కుమారుల వద్దకు నేమారామ్జీ వెళ్లారు. మూడు గంటల తర్వాత తిరిగి ఇంటికి వెళ్లకపోగా, ఆయన సెల్ఫోన్ కూడా పనిచేయలేదు.
తొలుత మిస్సింగ్ కేసు నమోదు
ఒక రోజంతా వెతికిన కుటుంబ సభ్యులు శనివారం పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. అయితే, 4వ తేదీ సాయంత్రం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురహరిపల్లి చెరువు కట్టపై ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారు. దీంతో మేడ్చల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతుడు పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో మిస్సయిన నేమారామ్జీగా గుర్తించి కేసును దర్యాప్తు నిమిత్తం బదిలీ చేశారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం
ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి దర్యాప్తు చేసి ఉంటే ఈ హత్య జరిగి ఉండేది కాదని ఆందోళనకారులు ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే నేమారామ్జీ ప్రాణాలు కోల్పోయారని, ఈ హత్యకు వారే బాధ్యులని మండిపడ్డారు. సికింద్రాబాద్, బోయిన్పల్లి, అల్వాల్, సుచిత్ర తదితర ప్రాంతాల నుంచి సుమారు 200 మందికి పైగా మార్వాడీలు పేట్ బషీరాబాద్ పీఎస్ ఎదుట నిరసన తెలిపారు. ఇంటి నుంచి ఆయన సుమారు రూ.10 లక్షల నగదు తీసుకెళ్లినట్లు సమాచారం. కుత్బుల్లాపూర్ జోన్ అదనపు డీసీపీ పురుషోత్తం, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. మృతుడు రెండు రోజుల పాటు ఎక్కడెక్కడికి వెళ్లాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
