Telugu Producers Council Election 2026
* కీలక పోస్టుల్లోనూ మన ప్యానెల్ హవా..
* సెక్రటరీ ఫలితం కోర్టు తీర్పు తర్వాతే
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికల్లో మన ప్యానెల్ ఘన విజయం సాధించింది. ప్రోగ్రెసివ్ ప్యానెల్‌తో జరిగిన పోటీలో అధ్యక్ష పదవికి సి.కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగతా కీలక పోస్టుల్లోనూ మన ప్యానెల్ అభ్యర్థులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. అయితే సెక్రటరీ పదవికి సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండటంతో ఆ ఫలితాన్ని వెల్లడించలేదు.
* కీలక ఫలితాలు ఇవే..
– అధ్యక్షుడు: సి.కళ్యాణ్ – ఏకగ్రీవం
– కోశాధికారి: చదలవాడ శ్రీనివాసరావు – మన ప్యానెల్
– వైస్ ప్రెసిడెంట్: మోహన్ వడ్లపట్ల – మన ప్యానెల్
– వైస్ ప్రెసిడెంట్: దామోదర ప్రసాద్ – ప్రోగ్రెసివ్ ప్యానెల్
– జాయింట్ సెక్రటరీలు: అమ్మిరాజు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ – మన ప్యానెల్
– సెక్రటరీ: ఫలితం కోర్టు పరిధిలో
* ఈసీ సభ్యుల్లోనూ మన ప్యానెల్ ఆధిపత్యం
ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యుల ఎన్నికల్లోనూ మన ప్యానెల్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 15 మంది ఈసీ సభ్యుల్లో మన ప్యానెల్‌కు చెందిన 12 మంది విజయం సాధించగా, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ముగ్గురు ఎన్నికయ్యారు.
మన ప్యానెల్ నుంచి ఎన్నికైన ఈసీ సభ్యులు వీరే ..
పద్మిని, ఎషియన్ సునీల్, మోహన్ గౌడ్, శివలెంక కృష్ణప్రసాద్, దానయ్య, వంశీ నందిపాటి, పల్లి కేశవరావు, శ్రీనివాసరావు, పుల్లారావు, బాపిరాజు, ఆర్.కె. కౌడ్, నయీం.
* ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి
మైత్రి రవి, నిరంజన్ రెడ్డి, డీఎస్ రావు.
సెక్రటరీ ఫలితం 8న వెల్లడించే అవకాశం
సెక్రటరీ పోస్టుకు సంబంధించిన కేసు కోర్టులో ఉండటంతో ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారి దుర్గా ప్రసాద్ సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించనున్నారు. సెప్టెంబర్ 8న న్యాయమూర్తి సమక్షంలో సెక్రటరీ ఎన్నికల ఫలితాన్ని వెల్లడించనున్నట్లు తెలిపారు. దీంతో సెక్రటరీ పదవికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. కోర్టు సమక్షంలో ఫలితం వెల్లడైన తర్వాతే ఈ అంశంపై అధికారిక స్పష్టత రానుంది.
* నిర్మాతల కోసం పనిచేస్తాం: సి.కళ్యాణ్
ఎన్నికల అనంతరం అధ్యక్షుడిగా ఎన్నికైన సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. నిర్మాతలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే తాము ముందుకు వచ్చామని తెలిపారు.
“మేము ఇక్కడికి మంచి చేయడం కోసం వచ్చాం. నిర్మాతల కోసం వచ్చాం. నిర్మాతల మంచి కోసం పనిచేస్తాం. అన్ని పరిశ్రమల కంటే తెలుగు చిత్ర పరిశ్రమ బాగుంది. మాకు అందరూ సహకరించాలి. అతి త్వరలోనే మా కార్యాచరణను వెల్లడిస్తాం” అని చెప్పారు.
చిన్న నిర్మాతలకు అన్ని విధాలా అండగా నిలుస్తానని సి.కళ్యాణ్ హామీ ఇచ్చారు. తనకు సహకరించిన బండ్ల గణేష్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
సెక్రటరీ పదవికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నందున ఆ ఫలితాన్ని కోర్టే అధికారికంగా వెల్లడిస్తుందని ఆయన పేర్కొన్నారు.
అనుభవంతో పరిశ్రమ అభివృద్ధికి కృషి: చదలవాడ
కోశాధికారిగా ఎన్నికైన చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ ప్యానెల్‌కు మద్దతు ఇచ్చిన నందమూరి కుటుంబానికి, సునీల్ నారంగ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తమ ప్యానెల్లో అనుభవజ్ఞులు ఉన్నారని, వారి అనుభవాన్ని ఉపయోగించుకుని తెలుగు సినీ పరిశ్రమను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా చిన్న నిర్మాతలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు.
* పరిశ్రమకు మంచి చేసేవారే గెలిచారు
-తుమ్మల ప్రసన్నకుమార్
తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. పరిశ్రమకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నవారే విజయం సాధించారని అన్నారు.

———–

Please tell us what is wrong. Your report will be sent to the website team.
