
* జగిత్యాలలో సంచలనంగా మారిన ఘటన
* రంగంలోకి పోలీసులు.. పూర్తి స్థాయిలో విచారణ
* ఇరువర్గాలూ పోలీస్ స్టేషన్కు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చందమామ పైకి దూసుకుపోతున్న టెక్నాలజీ యుగంలోనూ అమానవీయ ఘటనలు ఆగడం లేదు. తాజాగా గణపతి చందా ఇవ్వలేదని కుల బహిష్కరణ (Caste Boycott) చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై స్పందించిన సర్కారు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇందుకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. గణపతి నవరాత్రులు తెలంగాణ(Telangana)లో ఘనంగా జరిగాయి. పండుగ నిర్వహణలో చాలా మంది ఐక్యతను చాటారు. కలిసి మెలిసి వినాయక ఉత్సవాలను సంతోషంగా జరుపుకున్నారు. అయితే ని జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో విచారకర ఘటన చోటుచేసుకుంది. గణపతి నవరాత్రుల నిర్వహణకు రూ.1,116 చందా ఇవ్వలేదని నాలుగు కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. తమ కులానికి చెందిన వారు ఎవరైనా ఆయా కుటుంబాలకు చెందిన సభ్యులతో మాట్లాడితే రూ. 25వేల జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదండోయ్.. అలా మాట్లాడిన వారి సమాచారం ఇస్తే వారికి రూ.5వేలు నజరానా ఇస్తామని ప్రకటించారు. గ్రామంలో దండోరా కూడా వేయించారు. గ్రామంలోనే కాదు.. ఎక్కడో దుబాయ్ (Dubai)లో ఉన్న వ్యక్తిని కుల బహిష్కరణ చేయడం గమనార్హం. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఏటా తమ కులం పేరుతో గణపతి వేడుకలను నిర్వహిస్తారని, అయితే ఈసారి చందాల కోసం ఘోరంగా వ్యవహరించారని, వాట్సాప్ గ్రూప్లో పరుషపదజాలం ఉపయోగించారని బాధితులు వాపోయారు.
సర్కారు సీరియస్!
కులబహిష్కరణ ఘటనపై సర్కారు సీరియస్ అయింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆ కమ్యూనిటీలోని ఇరువర్గాలతోనూ చర్చించారు. కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యను పరిష్కరిస్తామని జగిత్యాల రూరల్ సీఐ తెలిపారు. ఆ గ్రామంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, ఇటువంటి ఘటనలకు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై చట్టప్రకారం తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకంటామని జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు.
…………………………………………………………………………………………