* 98 శాతం కులగణన పూర్తి
* ప్రభుత్వం ఇస్తున్న గ్యారెంటీలు పేదలకే అందుతున్నాయ్
* అమ్మలా ఉండే తెలంగాణ తల్లినే తెచ్చుకున్నాం
* రైతాంగ పోరాటంలో తెగువ చూపిన దొడ్డి కొమురయ్య
* కురుమ భవన ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: జనాభా ప్రాతిపదికన ఫలాలు అందాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన 98 శాతం మేరకు పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మిగిలిన రెండు శాతం పూర్తయితే దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ కులగణన తెలంగాణ ప్రజల మెఘా హెల్త్ ప్రొఫైల్‌గా మారుతుందన్నారు. హైదరాబాద్‌లో నిర్మించిన కురుమ విద్యార్థి వసతి గృహ ట్రస్ట్ – దొడ్డి కొమురయ్య ఆత్మ గౌరవ కురుమ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ రజాకార్లను గ్రామాల్లోకి రాకుండా, దొరల పెత్తనాన్ని అడ్డుకోవడానికి దుడ్డుకర్రల సంఘం పెట్టి పోరాడిన గొప్ప యోధుడు దొడ్డి కొమురయ్య అన్నారు. చాకలి ఐలమ్మ పేరును యూనివర్సిటీకి పెట్టినట్టుగానే, దొడ్డి కొమురయ్య శాశ్వతంగా గుర్తుండిపోయేలా మంత్రివర్గ సహచరులతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. దొడ్డి కొమురయ్య భవన ప్రాంగణం ఒక విద్యా వేదిక కావాలి.. విజ్ఞానం పంచాలి.. కురుమ సోదరులకు విద్య కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రుణమాఫీ, వరికి బోనస్, ఉచిత విద్యుత్, రూ.500 లకే సిలిండర్, పేదలకు వైద్య సౌకర్యాలు అందించడం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కువగా బలహీన వర్గాలకు అందుతున్నాయన్నారు. తెలంగాణకు జమిందారుల తల్లి కాదు.. బహుజనుల తెలంగాణ తల్లి ఉండాలి. ఏ తల్లి అయితే మన అమ్మ లాగా ఉంటుందో, అడక్కుండానే మన ఆకలిని గుర్తించి బుక్కెడు అన్నం పెడుతుందో అలాంటి తెలంగాణ తల్లిని తెచ్చుకున్నామన్నారు. మన అమ్మకు ప్రతిరూపం. మన అక్కకు ప్రతిరూపం. ఒకపక్క వరి, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న వంటి తెలంగాణలో పండిరచే పంటతో పాటు నా బిడ్డలు చల్లంగా ఉండాలి. నా బిడ్డలు శాశ్వతంగా అభివృద్ధి పథంవైపు నడవాలని ఆశీర్వదించే తెలంగాణ తల్లిని మనం ప్రతిష్టించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కర్నాటక రాష్ట్ర మాజీ మంత్రి హెచ్ రేవణ్ణ తదితరులు పాల్గొన్నారు.
……………………………………