* తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని లేఖలు రాస్తున్నారు
* కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు
* గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్మానం పంపాలి
* బీఆర్ ఎస్ సీనియర్ నాయకులు హరీశ్ రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు ఆటలాడుతున్నారని, తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ సీనియర్ నాయకులు హరీశ్‌రావు (Harishrao) విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు నిర్మించాలంటే కేఆర్ ఎంబీ, జీఆర్ ఎంబీ అనుమతులు తీసుకోవాలని హరీశ్ రావు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని అన్ని రాష్ట్రాలూ ఒప్పుకోవాలని వెల్లడించారు. అపెక్స్ కౌన్సిల్ లో అనుమతి తీసుకోవాలన్నారు. కాళేశ్వరానికి అన్ని అనుమతులూ వచ్చిన తర్వాతే కేంద్రానికి టీడీపీ (TDP) ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు కాదని, ప్రాణహితకు కొనసాగింపేనని కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. పాలమూరు ఎత్తిపోతలకు అనుమతులు ఇవ్వద్దని చంద్రబాబు (Chandrababu)కేంద్రానికి లేఖ రాశారని విమర్శించారు. దిండి ఎత్తిపోతలకు కూడా అనుమతులు ఇవ్వద్దని లేఖలు రాశారని తెలిపారు. తెలంగాణకు చెందిన 20కు పైగా ప్రాజెక్టులు నిలిపివేయాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖలు రాసిందని వెల్లడించారు. కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉందని చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. గోదావరి – బనకచర్ల కొత్త ప్రాజెక్టు కాదా అని ప్రశ్నించారు. దానికి ఒక్క అనుమతి కూడా లేకుండా ఏపీ ముందుకు వెళ్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎందుకు నిద్రపోతోందని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారని అన్నారు. సర్కారు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్మానం పంపాలని సూచించారు.
……………………………………………
