* మా కష్టాన్ని నాశనం చేశారు…
* రైతులకు నమ్మకద్రోహం చేశారు..
* తలుచుకుంటే బాధ, ఆవేదన కలుగుతోంది..
* అమరావతి బ్రాండ్ దెబ్బతింది..
* దేశ చరిత్రలో ఎవరూ రాజధానిని మార్చలేదు..
* అలాంటి వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి..
* నా ఆలోచనలను కొన్నిసార్లు ప్రజలు అర్థం చేసుకోలేదు
* సైబరాబాద్‌ను నేనే అభివృద్ధిని చేశా
* అమరావతిని కూడా దేశపటంలో ముందుంచుతా
* అమరావతిలో ఐదేళ్లలో జరిగిన నష్టంపై శ్వేత పత్రం విడుదల చేసిన చంద్రబాబునాయుడు
ఆకేరు న్యూస్, అమరావతి : ఏపీ రాజధాని అమరావతికి (Capital of AP is Amaravati) సంబంధించి జాతి ద్రోహానికి పాల్పడ్డారని, దేశ చరిత్రలో ఎవరూ రాజధానిని మార్చలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (AP Chief Minister Chandrababu Naidu) అన్నారు. అలాంటి మెంటల్ ఆలోచనలు ఉన్న వ్యక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలన (The rule of YCP) ఐదేళ్లలో అమరావతికి జరిగిన నష్టాన్ని వివరిస్తూ చంద్రబాబు శ్వేతపత్రం(White Paper) విడుదల చేశారు. “ఆంధ్రులు ఏం పాపం చేశారు.. దేశానికి అన్నం పెట్టే మనం ఇతర రాష్ట్రాలకు వెళ్లి బతకాల్సిన పరిస్థితులు ఏంటి? యువతకు అవకాశాలు లేకుండా పో్యాయి. ఐదేళ్లలో అమరావతిని నాశనం చేశారు. మా కష్టాన్ని వృథా చేశారు. రైతులకు నమ్మకద్రోహం చేశారు. తలుచుకుంటే బాధ, ఆవేదన కలుగుతోంది.” అంటూ చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.
ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మొదలుపెడతా..
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజధానిని మార్చిన వ్యక్తులను చూడలేదని, అలాంటి తిక్క, మెంటల్, మూర్ఖులకు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా అని జగన్ (Jagan)ను ఉద్దేశించి చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి (Amaravati) బ్రాండ్ దెబ్బతిందన్నారు. నా ఆలోచనలను కొన్నిసార్లు ప్రజలు అర్థం చేసుకోలేదని, కొన్నిసార్లు వారికి అర్థం అయ్యేలా తాను చెప్పలేకపోయానని వెల్లడించారు. సైబరాబాద్‌ను తానే అభివృద్ధిని చేశానని, అమరావతి అభివృద్ది ఎక్కడ ఆగిందో.. అక్కడి నుంచే మొదలుపెడతానని, ముందుగా పెట్టుబడుదారులకు నమ్మకం కలిగించాల్సి ఉందని చెప్పారు. అమరావతిని కూడా దేశపటంలో ముందుంచుతా అని చెప్పారు. అమరావతిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్ని శ్వేతపత్రంలో వివరించారు.
అమరావతికి ఎంతో సెంటిమెంట్
బ్రిటీష్ మ్యూజియంలో అమరావతికి గ్యాలరీ ఉందని, రాష్ట్ర విభజన జరుగుతుందని ఎవరూ ఊహించలేదన్నారు సీఎం చంద్రబాబు. విభజన తర్వాత అమరావతే రాజధానిగా అవుతుందన్నది కూడా ఎవరూ అనుకోలేదని పేర్కొన్నారు. అమరావతికి ఎంతో సెంటిమెంట్ ఉందని, పవిత్ర దేవాలయాల్లోని మట్టిని తీసుకొచ్చి అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు సిటీలుంటే.. మూడో సిటీ సైబరాబాద్ ను అభివృద్ధి జరిగింది తన హయాంలోనేనని పేర్కొన్నారు. హైదరాబాద్ కు నీళ్లు, కరెంట్ లేని రోజుల నుంచి.. అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్(Hyderabad) కు నీళ్లకోసం కృష్ణాజలాలను తీసుకొచ్చి చరిత్ర తిరగరాశామని చెప్పారు. అలాంటి అనుభవంతోనే అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో ఏ పక్క నుంచి చూసినా అమరావతి ప్రాంతమే మధ్యలో కనిపిస్తుందన్నారు. హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తామన్నారు.
రంగాలు దెబ్బతిన్నాయి..
ఐదేళ్ల కాలంలో అమరావతి అభివృద్ధి ఆగిపోవడంతో.. అన్ని రంగాలు దెబ్బతిన్నాయన్నారు. కూలిపనులు, పాచి పనులకు కూడా సొంతూళ్లను వదిలి హైదరాబాద్ బాట పట్టాల్సిన పరిస్థితి దాపరించిందన్నారు. యువతకు ఉద్యోగాలు లేకుండా పోయిందని, ఇదంతా గత పాలకుల అరాచకం వల్లేనన్నారు. హైదరాబాద్ నాలెడ్జ్ అకాడమీలోనే 7-10 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఐటీ సెక్టార్ (IT sector) ఒకటి రెడీ అయితే అన్నిరకాల కంపెనీలు వచ్చేవని, అలాంటిది వైసీపీ(YCP) వల్ల అవన్నీ ఆగిపోయాయన్నారు. చరిత్రను తలుచుకుంటే బాధ కలుగుతుందన్నారు. అలాగని బాధపడుతూ కూర్చోకుండా అమరావతి అభివృద్ధికి వేగంగా అడుగులు వేస్తామని, ప్రజా రాజధాని.. అమరావతి అనే నినాదాన్ని విశ్వవ్యాప్తం చేస్తామన్నారు. ఇలా అనేక అంశాలను శ్వేతపత్రంలో చంద్రబాబునాయుడు వివరించారు.
———————————-