* నాలుగోసారి ప్రమాణస్వీకారం
* కేసరపల్లిలో అట్టహాసంగా ఉత్సవం
* తరలివచ్చిన అతిరథ మహారథులు
* కేంద్రం నుంచి ప్రధాని మోదీ సహా 8 మంది కేంద్రమంత్రులు
* ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి, రజనీకాంత్
ఆకేరు న్యూస్, విజయవాడ : కిక్కిరిసిన అశేష కార్యకర్తల కళ్లెదుట, అతిరథ మహారథుల మధ్యన, నవ్యాంధ్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.
నారా చంద్రబాబునాయుడు అనే నేను..
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కాని, పక్షపాతం కాని, రాగధ్వేషాలు కాని లేకుండా.. రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి.. ప్రజలు అందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను… అనగానే సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబును ఆలింగనం చేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్‌కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. పద్నాలుగు ఎకరాల సభా ప్రాంగణం పసుపురంగుతో శోభాయమానంగా మారింది. జనసేన జెండాలతో రెపరెపలాడింది. కాషాయకండువాలతో కళకళలాడింది. ఈ వేడుకతో కేసరపల్లిలో సందడి నెలకొంది. శ్రీ నారా చంద్రబాబునాయుడితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ గవర్నర్‌ను కోరడంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రమాణ స్వీకారం వీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ భారీ స్ర్రీన్ లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో మూడు పార్టీల కార్యకర్తలు సందడి చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు కొనసాగనున్నారు.
మంత్రులుగా..
చంద్రబాబునాయుడి ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, తర్వాత నారా లోకేశ్, అచ్చెంనాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, అనిత వంగలపూడి, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ ఎండి ఫరూఖ్, ఆనం రాంనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్ తదితరులు వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు.
ముగ్గురూ కలిసి వేదికపైకి..
ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకేసారి ప్రమాణ స్వీకార వేదికపైకి వచ్చారు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు విచ్చేసిన ప్రధాని మోదీకి చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. గన్నవరం నుంచి వేదిక వద్దకు ఒకేకారులో కలిసి వచ్చారు. వేదికపై సోదరి భువనేశ్వరిని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆత్మీయంగా పలకరించిన దృశ్యం ఆకట్టుకుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్రమంత్రులు అమిత్ షా, నడ్డా, గడ్కరీ సహా 8 మంది కేంద్రమంత్రులు, మహారాష్ట్ర సీఎం షిండే, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై, జస్టిస్ ఎన్వీ రమణ, పళని స్వామి, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, రాంచరణ్ తదితర రాజకీయ, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా వేదికపై నిలిచారు.
—————————