* దుష్పరిణామాలపై ఈ ఏడాది విస్తృతంగా ప్రచారం
* పోలీసులు, సామాజికవేత్తల అవగాహన
* కట్టడికి సీరియస్ గా ఫోకస్ పెట్టిన పోలీసులు అయినా…
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
సంక్రాంతి పండుగ వస్తోందంటే పతంగి.. మాంజా.. వీటికున్న క్రేజే వేరే. వీటి అమ్మకాల కోసమే ప్రత్యేకంగా దుకాణాలు వెలుస్తాయి. పిల్లలే కాదు.. పెద్దలు కూడా వాటి కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. అయితే.. దేశీ మాంజా ఓకే కానీ.. చైనా మాంజా ప్రాణాలు తీసేస్తోంది. పక్షులు, మనుషులకు హాని చేస్తోంది. ఇటీవలి కాలంలో మాంజా ప్రమాదాలు ఎక్కువ కావడంతో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దుష్పరిణామాలపై ఈ ఏడాది పోలీసులు, సామాజికవేత్తలు ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. మరోవైపు పోలీసులు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వ్యాపార సంస్థలపై దాడులు చేస్తున్నారు. చైనా మాంజా ఎవరూ అమ్మడానికి లేదని, ఎవరైనా అమ్మితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు.
ఆనందం సరే.. ప్రమాదమో..
యువత పోటీ పడి ఒకరి పతంగిని మరొకరు కట్ చేసి ఆనందపడుతుంటారు. చైనా మాంజా వినియోగించి ఎదుటువారి గాలిపటాన్ని కట్ చేసేందుకు బెట్టింగ్‌కు కూడా పాల్పడుతుంటారు. ఈ క్రమంలో పతంగుల నుంచి తెగిపడిన చైనా మాంజాలు విద్యుత్ స్తంభాలు, తీగలు, చెట్ల కొమ్మలకు చిక్కుకుంటున్నాయి. గాలికి అవి పాదచారులు, వాహనదారులపై పడడంతో గాయపడుతున్నారు. దీంతో పోలీసులు చైనా మాంజా విక్రయాలను అరికట్టేందుకు నడుం బిగించారు. నగరంలో నిషేధిత మాంజాను భారీ స్థాయిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 1.2 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
గాల్లో వేలాడుతూ.. మెడకు చుట్టుకుంటూ..
ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటుఉండగా పోలీసులు పట్టుకున్నారు. దీనిపై నిషేధం ఉన్నా కొందరు విక్రయాలు సాగిస్తున్నారు. ఈ మాంజా తెగి గాల్లో వేల్లాడుతున్న సమయంలో వాహనదారుల మెడకు చుట్టుకుంటోంది. దీని వల్ల కొందరు గాయాలపాలవుతున్నారు. దీంతో ప్రాణాంతకమైన చైనా మాంజాపై కేంద్రం నిషేధం విధించిందని సీపీ సజ్జనార్ వెల్లడించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు. ఈ మాంజా కొన్నా నేరమేనని నగర ప్రజలకు సూచించారు.
………………………………………………………

