*భార్య, భర్త, కూతురు దుర్మరణం
*చిత్తూరు ప్రమాదం.. హృదయవిదారకం
ఆకేరు న్యూస్, డెస్క్ : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదం ఒక అందమైన కుటుంబం ఆశలు ఆవిరైపోయిన కన్నీటి గాథగా మిగిలిపోయింది. అమ్మ, నాన్న, కూతురు.. ముగ్గురిదీ ఒకే ప్రాణం. ఎంతో ఇష్టంగా ప్లాన్ చేసుకున్న తిరుమల యాత్ర.. విధి ఆడిన వింత నాటకంలో మధ్యలోనే ముగిసిపోయింది.
వరంగల్ నగరానికి చెందిన శ్రీధర్ రావు, ఆయన భార్య లక్ష్మి, కుమార్తె అద్విక బెంగళూరులో నివసిస్తున్నారు. శనివారం ఉదయం బెంగళూరు నుంచి తిరుమల వెళ్లేందుకు ట్యాక్సీలో బయలుదేరారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్దకు రాగానే, రోడ్డు పక్కన ఆగి ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సును వీరి కారు అతివేగంగా వెనుక నుంచి ఢీకొట్టింది.
*కన్నీటికే కన్నీరొచ్చె..
ప్రమాదం జరిగిన తీరు చూసిన ప్రతి ఒక్కరికీ కన్నీరు తెప్పించింది. కారు వెనుక సీట్లలో భార్య, కూతురు, ముందు సీట్లలో శ్రీధర్ రావు, డ్రైవర్ ఉన్నారు. ఆగి ఉన్న బస్సును కారు వేగంగా ఢీకొట్టినప్పుడు, కారు ముందు భాగం బస్సు కిందకు దూసుకుపోయింది. దీంతో ముందు సీటులో ఉన్న తండ్రి శ్రీధర్ రావు, వెనుక సీటులో ఉన్న కుమార్తె అద్విక ప్రమాద తీవ్రతకు కారు లోపల నలిగిపోయారు. తండ్రి గుండెలపై కూతురు, ఆ తండ్రి భుజంపై తల వాల్చిన స్థితిలో భార్య మృతదేహాలు ఇరుక్కుపోయి ఉన్నాయి.
మరణం ముంచుకొస్తున్న తరుణంలోనో, లేదా ఆ భీకర శబ్దానికి భయపడియో కానీ.. ప్రాణం పోయే క్షణంలో కూడా ఆ తండ్రి తన బిడ్డను రక్షించుకోవాలని ప్రయత్నించినట్లుగా, లేదా ఆ బిడ్డ తన తండ్రి రక్షణను కోరుకున్నట్లుగా ఉన్న ఆ దృశ్యం చూసి అక్కడి వారు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, ఇతర సిబ్బంది గ్యాస్ కట్టర్ల సాయంతో ఆ మృతదేహాలను వేరు చేస్తున్నప్పుడు, విడదీయలేని ఆ బంధాన్ని చూసి చలించిపోయారు. ఇదిలా ఉండగా కారు శ్రీధర్‌రావు కూర్చున్న వైపే అధికంగా బస్సు కిందకు దూసుకెళ్లడంతో డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు.
