
* నిమజ్జనాలను స్వయంగా పరిశీలన
ఆకేరున్యూస్, హైదరాబాద్ : గణేశ్ నిమజ్జనాలతో ట్యాంక్‌బండ్ కోలాహలంగా ఉంది. బైబై వినాయక అంటూ ప్రజలు వీడ్కోలు పలుకుతున్నారు. వేలాది విగ్రహాలు ట్యాంక్ బండ్‌కు క్యూ కడుతున్నాయి. లక్షలాది మంది భక్తులు విచ్చేసి గణపతి దేవుడికి వీడ్కోలు పలుకుతున్నారు. అశేష జనంతో కిక్కిరిసిన ట్యాంక్ బండ్ వద్దకు తెలంగాణ సీఎం రేవంత్ (REVANTH ) విచ్చేశారు. పరిమిత కాన్వాయ్ వచ్చి సామాన్య భక్తుడిలా అక్కడకు విచ్చేశారు. ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు, కట్టుబాట్లు లేకుండా చేరుకున్నారు. నిమజ్జన పర్వాన్ని స్వయంగా వీక్షించారు. ఎన్టీఆర్ మార్గ్ (NTR MARG)లోని క్రేన్ నంబర్ 4 వద్ద కాసేపు గడిపారు. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న తీరును పరిశీలించారు. సీఎం నేరుగా వచ్చి నిమజ్జన పర్వాన్ని వీక్షిస్తుండడం ఆసక్తిగా మారింది. అక్కడే ఉన్న భక్తులతో కరచాలనం చేస్తూ, సెల్ఫీలు దిగుతూ రేవంత్ సందడి చేశారు. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి? ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేయాలి? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి.. అనే వివరాలను అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేసి అక్కడి నుంచి తన వాహనంలో వెళ్లిపోయారు.
…………………………………..